హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

Vijaya
ఇప్పటివరకు పార్టీ పేరు ప్రకటించలేదు. జెండా లేదు..అజెండాలేదు. అయినా తెలంగాణాలో పట్టుకోసం వైఎష్ షర్మిల చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. లోటస్ పాండ్ లో మీటింగులున్నారు. ఖమ్మంలో బహిరంభ సభ నిర్వహించారు. ఒకవైపు డైరెక్టుగా కేసీయార్ ను మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఎటాక్ చేస్తున్నారు. ఇదే సమయంలో కేసీయార్ వ్యతిరేకులందరినీ కలుపుకుని వెళ్ళేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష కూడా చేశారు. సరే ఇవన్నీ ఒకవైపు నడుస్తుండగానే తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో కేసీయార్ టార్గెట్ గా షర్మిల సెటైర్లు మొదలుపెట్టారు. అదికూడా పక్కా తెలంగాణా యాసలోనే కేసీయార్ ను కరోనా వైరస్ ను కలుపుతు సెటైర్లు వేశారు.



కొత్త ఆరోగ్యశాఖ మంత్రి కేసీయార్ గారికి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే దొరగారు చెప్పినట్లు ఇక పారాసిటమల్ తోనే కరోనా పోతది అన్నారు. ఆక్సిజన్ కొరతలుండవు..వ్యాక్సిన్ అందనివారుండరు..కొత్త కొత్త హాస్పిటల్స్ కట్టిస్తడు..డాక్టర్లు, నర్సులను రిక్రూట్ చేస్తడు.. అంటు ఎద్దేవాచేశారు.  అలాగే కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తడు..సర్కార్ దవాఖానాల సౌలతులు పెంచుతడు..సర్కార్ దవాఖానాకు జనాలు లైన్లు కడతరు.. ఎవరైనా ఎదురుమాట్లాడితే కరోనా తలగాలని శాపాలు పెడతడు..కరోనా బారినపడి కరోనా కోసం కొట్లాడుతున్న..కరోనా వీరుడు కేసీయార్ గారు అంటు సీఎంపై గట్టిగానే సెటైర్లు పేల్చారు. అచ్చం తెలంగాణా యాసలోనే షర్మిల తన ట్వీట్లను పోస్టు చేయటం గమనార్హం.



పనిలో పనిగా అవినీతి ఆరోపణలపై మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ పై విచారణకు ఆదేశించటాన్ని షర్మిల స్వాగతించారు. అయితే ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మంత్రి మల్లారెడ్డి, ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్  విషయంలో మాత్రం ఎందుకు స్పందించటం లేదంటు కేసీయార్ ను గట్టిగానే నిలదీశారు. ‘ఈటలను సాగనంపటమంటే పొమ్మనలేక పొగబెట్టారా లేకపోతే ప్రశ్నిస్తున్నందుకు ఎసరుపెట్టారా’ ? అంటు ప్రశ్నించారు. మొత్తానికి పార్టీ ఇంకా పెట్టకముందే కేసీయార్ ను  వైఎస్ షర్మిల గట్టిగానే తగులుకుంటున్నారు. మరి పార్టీ పెట్టిన తర్వాత ఇంకేమి చేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: