హెరాల్డ్ సెటైర్ : ధైర్యంగా పారిపోయిన చంద్రబాబు

Vijaya
పరిషత్ ఎన్నికలను బహిష్కరించటం ద్వారా చంద్రబాబునాయుడు చాలా ధైర్యంగా పారిపోయారు. పాలిట్ బ్యూరో సమావేశం పెట్టుకుని జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని డిసైడ్ చేశారు. టీడీపీ ఎన్నికలను ఎందుకు బహిష్కరిస్తోందంటే పార్టీ ఇంట్రస్టు, జనాల ఇంట్రస్టును దృష్టిలో పెట్టుకునేనట. నేరస్తులు+పోలీసులు కలిసిపోతే సమాజానికి ఎంతటి నష్టం జరుగుతుందో జనాలందరు గ్రహించాలని చంద్రబాబు జనాలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను బహిష్కరించాలనే టీడీపీ నిర్ణయం విషయంలో జనాలు కూడా ఆలోచించాలని చంద్రబాబు ప్రజలను కోరారు. ఎన్నికలను బహిష్కరించింది టీడీపీ అయితే ఎందుకు బహిష్కరించిందో ఆలోచించాల్సిన బాధ్యత జనాలపైన ఉందట.



నిజానికి ఎన్నికల్లో పోటీచేసేంత సీన్ టీడీపీకి లేదని ఎప్పుడో తేలిపోయింది. పంచాయితి, మున్సిపాలిటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాత తెలుగుదేశంపార్టీ నేతలు పూర్తిగా డీలా పడిపోయారు. ఎంతగా పోరాడినా టీడీపీ నేతలవైపు జనాలు చూడటంలేదని తేలిపోయింది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అయితే టీడీపీ తరపున పోటీ చేయటానికి చాలా చోట్ల అభ్యర్ధులే దొరకలేదు. అందుకనే మున్సిపాలిటిలకు మున్సిపాలిటీలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. 75 మున్సిపాలిటిల్లో టీడీపీ గెలిచింది కేవలం ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే. అలాగే 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే 11 కార్పొరేషన్లలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇంకా ఒక కార్పొరేషన్ ఫలితం రావాల్సుంది. వాస్తవాలు ఇలాగుంటే ప్రజలంతా తమవైపే ఉన్నారని చంద్రబాబు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.



ఇక కొత్తగా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్నిపై చంద్రబాబు బురదచల్లేశారు. సుప్రింకోర్టు డైరెక్షన్ ఉండగా, హైకోర్టులో కేసుండగానే, ప్రతిపక్షాలన్నీ పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతుంటే కమీషనర్ ఎందుకు పట్టించుకోలేదంటు మండిపోయారు. కొత్త కమీషనర్ జగన్మోహన్ రెడ్డి ఇంటి మనిషి కాబట్టే ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటోందంటు ఎద్దేవా చేశారు. ఇంతకాలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. నిమ్మగడ్డ ఉన్నపుడే తమ పప్పులుడకలేదు. అలాంటిది కొత్త కమీషనర్ హయాంలో తమను పట్టించుకునే దిక్కు కూడా ఉండదని చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. అందుకనే ఎన్నికల బహిష్కరణకు నీలం సాహ్ని తొందరపాటు, జగన్ వైఖరే కారణమన్నారు. చూస్తుంటే ఆడలేక మద్దెల ఓడన్న పద్దతిలో ఉంది చంద్రబాబు వ్యవహారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: