హెరాల్డ్ సెటైర్ : పవన్ను మునగచెట్టు ఎక్కించేస్తున్నారా ?

Vijaya
మునగ చెట్టు ఎక్కితే ఏమవుతుందో  మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఇపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి కూడా ఇలాగే తయారైంది. తాజాగా బీజేపీ చీఫ్ సోమువీర్రాజు మాట్లాడుతు ఏపికి కాబోయే సీఎం పవన్ కల్యాణే అని ప్రకటించేశారు. పవన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వయంగా తనకు చెప్పినట్లు వీర్రాజు పెద్ద బిస్కెట్టే వేశారు. మోడి+అమిత్ షా కు పవన్ చాలా సన్నిహితుడని కూడా ఊదరగొట్టేశారు. ఇదంతా ఎక్కడ చెప్పారంటే తిరుపతిలో జరిగిన బీజేపీ+జనసేన నేతల సమన్వయకమిటి సమావేశంలో. ఎందుకు చెప్పారంటే ప్రచారంలోకి పవన్ను లాగటానికి. అంత అవసరం ఏమొచ్చిందంటే రత్నప్రభను అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించి నాలుగురోజులైనా ఇంతవరకు పవన్ నుండి కానీ జనసేన నుండి కానీ అధికారికంగా మద్దతు ప్రకటన రాలేదుకాబట్టే.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఉపఎన్నికలో ఎలాగైనా తమ అభ్యర్ధినే పోటీచేయించాలని జనసేన విశ్వప్రయత్నాలు చేసింది. అయితే పవన్ ప్రయత్నాలను ఎక్కడికక్కడ బీజేపీ నేతలు అడ్డుకుని చివరకు పవన్ కు వాయిస్ కూడా లేకుండా చేసేశారు. తెరవెనుక ఏమి జరిగిందో ఏమో తెలీదు కానీ చివరకు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధే పోటీచేస్తారన్న విషయాన్ని పవన్ తోనే బీజేపీ నేతలు ప్రకటింపచేశారు. దాంతో అప్పటినుండి పవన్ తో పాటు జనసేన నేతలంతా బాగా మండిపోతున్నారు. బయటకు దెబ్బలు తగలకుండా పోలీసులు ఎలా కొడతారో బీజేపీ నేతలు అలాగే జనసేన విషయంలో వ్యవహరించారు. ఆ విషయాలను బయటకు చెప్పుకోలేక బహిరంగంగా బీజేపీని వ్యతిరేకించలేక పవన్ అండ్ కో నానా అవస్తలు పడుతున్న విషయం అర్ధమైపోతోంది.



ఈ నేపధ్యంలో పవన్ గనుక రత్నప్రభ ప్రచారానికి రాకపోతే తీరని నష్టం జరుగుతుందని బీజేపీ నేతలు గ్రహించారు. అసలు కమలంపార్టీకి బలమేలేదు. ఉపఎన్నికలో అభ్యర్ధిని తమ పార్టీ ఎందుకు పోటీపెట్టిందో బీజేపీలోని చాలామంది నేతలకు అర్ధమే కావటంలేదు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన మొత్తం ఓట్లు 16 వేలు. నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా)కు వచ్చిన ఓట్లు 25 వేలు. దీంతోనే బీజేపీ పరిస్ధితేమిటో అర్ధమైపోతోంది. పైగా జనసేనకు పోటీచేసే అవకాశం ఇవ్వకపోతే బీజేపీకి ఓట్లేయకూడదని తిరుపతిలోని  బలిజ సామాజికవర్గం తీర్మానించిందనే ప్రచారం బాగా జరుగుతోంది. దీంతో గెలుపు సంగతి తర్వాత కనీసం డిపాజిట్లయినా తెచ్చుకోకపోతే ఢిల్లీలో పరువుపోతుందని వీర్రాజు అండ్ కో టెన్షన్ మొదలైంది. అందుకనే కాబోయే సీఎం పవన్ అని, మోడి, అమిత్ కు పవన్ చాలా ఇష్టుడనే బిస్కట్లు వేసి మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం మొదలుపెట్టారు. మరి పవన్ బిస్కెట్లకు పడిపోతారా ? మునగచెట్టు ఎక్కుతారా ? చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: