సెటైర్ : జగన్ ను ఫాలో అవ్వోయ్ లోకేష్ ?

ఒకసారి ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి దూకారు అంటే నిరంతరం ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని , నిరంతరం వారి సమస్యలపైన పోరాడుతూ, వారికి అండగా నిలబడుతూ, అన్ని రకాలుగా మేలు చేసే విధంగా వ్యవహరించాలి. కానీ అలా కాకుండా గుర్తొచ్చినప్పుడు వీరావేశం ప్రదర్శిస్తూ, మిగతా సమయంలో ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, సోషల్ మీడియా ద్వారా నాలుగు కామెంట్లు పెట్టి, ఇదే రాజకీయం అని గొప్పగా చెప్పుకుంటే లాభం ఉండదు. ఈ విషయం చంద్రబాబు ముద్దుల తనయుడు లోకేష్ బాబు కు ఎప్పుడు అర్థమవుతుందో అంటూ తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు నిట్టూర్పులు పోతున్నారు. లోకేష్ బాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి చాలా కాలం అయ్యింది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేకపోయినా, పరోక్షంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 



ఎమ్మెల్సీగా ఆయనకు పదవి ఉంది. అన్ని కుదిరితే రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకుంటారు. అయితే , ఆ స్థాయికి రావడం అంటే ఆషామాషీ కాదు. ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని ఎన్నో రకాల ఇబ్బందులను తట్టుకుంటూ,  ప్రజల్లో నమ్మకం కలిగిస్తూ, పార్టీ నాయకుల అండదండలతో అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నించాలి. కానీ గుర్తొచ్చినప్పుడు మాత్రమే ప్రజాక్షేత్రంలో తిరుగుతూ, ఇంటి నుంచి , సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ , ప్రజల్లో బలం పెంచుకోవడం అంటే అది కుదరని పని. ఈ విషయం లోకేష్ కు సైతం బాగా తెలుసు. అయినా ఆయన తన వైఖరిని మార్చుకోవడం లేదు. నిన్నటి వరకు కరోనా వైరస్ భయంతో ఏపీలో అడుగు పెట్టేందుకు లోకేష్ ఇష్ట పడలేదు. కానీ అదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు  ఏపీలో పర్యటించడం 70 ఏళ్ల వయసు దాటిన ఆయన టిడిపిని బతికించుకోవడం కోసం రిస్కు చేయడం వంటి  వ్యవహారాల తో లోకేష్ విమర్శల పాలయ్యారు.


 దీంతో ఇష్టం లేకపోయినా,  జిల్లాల వారీగా పర్యటన లు చేపట్టి రెండు మూడు రోజులపాటు హడావుడి చేశారు. ఇక ఆ తర్వాత ఆయన మళ్ళీ తన గూటికి వెళ్లిపోయారు.ఆ రోజుల్లో టీడీపీ బరువు బాధ్యతలు మోయాల్సిన లోకేష్ ఈ విధంగా అప్పుడప్పుడు మాత్రమే మెరుస్తూ ఎక్కువగా విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, తనకు అలవాటు లేని ట్రాక్టర్ విన్యాసాలు చేస్తూ, మరింతగా తన వ్యవహారాలతో ఉన్న పరువు కాస్తా ఆయన తగ్గించుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అసలు ప్రజల్లో బలం పెంచుకు ని సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని, బలమైన నాయకుడిగా ఎదగాలి అనే విషయం లో ఏపీ సీఎం జగన్ ను లోకేష్ స్ఫూర్తిగా తీసుకుంటే మంచిదనే సూచనలు ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: