సెటైర్ : అప్పుడు తోకలు కత్తిరిస్తా అన్నాడు... ఇపుడేమో అతికించేస్తా అంటున్నాడు

సవరం అయితే కానీ వివరం రాలేదు అన్నట్లుగా ఇప్పుడు బాబుకు అసలు విషయం బోధ పడిపోయింది. అసలు తన అంతటి రాజకీయ సమర్ధులు ఈ ప్రపంచంలోనే ఉండరు అనేది బాబోరి ఇన్నర్ ఫీలింగ్. అసలు ఈ జనాలను అనాలి. తనంతటి రాజకీయ సమర్ధులను పక్కనపెట్టి, నన్ను ఓడించారు. ఇప్పుడు బాగా అనుభవించండి అంటూ అప్పుడప్పుడూ శాపనార్థాలు పెట్టేస్తున్నారు. ఆ జగన్ కి ఓట్లు వేసిన ప్రజానీకానికి బుద్ది వచ్చిందిలే అని అవకాశం దొరికినప్పుడల్లా సంబరపడిపోతున్నారు. అసలు మనం ఎందుకు ఓడిపోయాము అని నిత్యం చుట్టూ ఉన్న నాయకులను బాబు ప్రశ్నిస్తూనే వస్తున్నారు. వారి దగ్గర సమాధానం లేకపోవడంతో, ఆ సమాధానం వెతుక్కుంటూ అన్వేషణ చేస్తుంటే, అసలు విషయం అర్ధం అయ్యింది.

అధికారంలో ఉన్నన్ని రోజులు కన్నూ మిన్నూ తెలియకుండా అందరినీ దూరం చేసుకున్నామని, ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నామని, అర్జెంటుగా ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద ప్రేమ కురిపించాలని డిసైడ్ అయిపోయారు. వీరంతా మొన్నటి ఎన్నికల్లో ఆ జగన్ కి ఓటు వేసి తనకు అన్యాయం చేశారు కాబట్టి, వారిని మళ్లీ బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అసలు బాబొరి పార్టీకి కంచుకోటగా ఉండే బీసీలు జగన్ వైపు వెళ్లడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే, అప్పడు ఓ ఇసయం గుర్తుకొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు తమ బాధలు బాబు గారికి చెప్పుకుని ఆయన కరుణా కటాక్షాలు సంపాదించాలని చూసినా,  నాయిబ్రాహ్మణులకు చంద్రాగ్రహం ఏ విధంగా ఉంటుందో చూపించిన ఇసయం గుర్తుకొచ్చింది.

 ఏం తమాషా గా ఉందా ? హే.. చెప్పేది విను. ఎక్కువ చేస్తే తోకలు కత్తిరిస్తా అంటూ, వారిపై ఊగిపోయిన సంగతి గుర్తుకొచ్చింది. అవన్నీ మర్చిపోయి ఈ మధ్య జగన్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణ కు అన్యాయం చేస్తోంది అని ఆ మధ్య జరిగిన బార్బర్స్ డే రోజున గొంతు ఎత్తి మరి నినాదాలు చేస్తూ, ఆయన, ఆయన గారి పుత్రరత్నం తెగ బాదపడిపోయారు.లోకేశం బాబు అయితే జగన్ ను గట్టిగానే ట్విట్టేసాడు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని వారందరికీ దగ్గరయ్యేందుకు పెద్ద పెద్ద ప్లాన్ లు వేసేస్తున్నాడు. మీరందరూ జగన్ వేసిన వలలో పడిపోయారు.

మిమ్మల్ని నేను రక్షిస్తాను అంటూ పదే పదే మాట్లాడుతూ వారికి దగ్గరయ్యేందుకు, వారు టీడీపీకి దగ్గరయ్యేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ, ప్రేమ కురిపించేందుకు రెండు రోజుల క్రితం పార్టీ నేతల దగ్గర చక్రం తిప్పినట్లు గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పుడు అర్జెంటుగా ఎస్సీ ,ఎస్టీ, బీసీల అంతా పసుపు జెండా కప్పుకోవాలని బాబు తహతహలాడిపోతున్నాడు. ఏదో ఒక రకంగా 2024లో కుదిరితే తాను, కుదరకపోతే లోకేశం బాబు కుర్చీ ఎక్కి దర్జా ప్రదర్శించాలని బాబొరి అసలు కోరిక అని ఆ పార్టీ నాయకులు చెవులు కొరికేసుకుంటున్నారు అని వాళ్ళు వీళ్ళు తెగ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: