హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబుకు ఏదో అయ్యింది.. లేకపోతే ఇలాంటి డిమాండ్లు చేస్తాడా ?
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో కూడా ఒకవైపు జనాలను భయపెట్టేస్తునే మరోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లేస్తున్నాడు. తాజాగా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా జనాలకు తిండికి లేక చనిపోయే రోజు తొందరలోనే వచ్చేస్తుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. జనాలకు ఊరటకలిగే నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన చంద్రబాబుకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంటే మాత్రం ఉపయోగమేమిటి ? అనే చర్చ జనాల్లోనే మొదలైంది. ఇపుడేమో రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వాళ్ళ నిత్యావసరాల కోసం బయటకు రాకుండా వాళ్ళందరికీ ఇళ్ళకే అందించాలట. నిజంగా ఇది ఆచరణ సాధ్యమేనా ? అని కూడా చంద్రబాబు ఆలోచించినట్లు లేదు.
క్వారంటైన్ సెంటర్లలో సౌకర్యాలు సరిగా లేవని వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఓ సలహా కూడా పడేశాడు. క్వారంటైన్ సెంటర్లంటే అవేమన్నా రిసార్ట్స్ లో గదులా ? అన్నీ సౌకర్యాలుండటానికి. క్వారంటైన్ కేంద్రానికి వచ్చిన రోగికి ఓ బెడ్డిస్తారు. అవసరానికి ఆహారం అందిస్తారు. అవసరానికి వైద్య సిబ్బంది వచ్చి వెళిపోతారంతే. ఇంతోటిదానికి సౌకర్యాలు లేవని ఫిర్యాదులు రావటమేంటి ? దాన్ని పట్టుకుని చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేయటమంటే అర్ధం కావటం లేదు. అలాగే కరోనా వైరస్ తో చనిపోయిన వాళ్ళకు నష్టపరిహారాన్ని కూడా పెంచాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 15 వేలు సరిపోదు కాబట్టి ఏకంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డిమాండ్ చేసేశాడు.
ఎప్పుడైనా ప్రమాదం జరిగినపుడు నష్టపరిహారం ఇవ్వటం మామూలే. కానీ కరోనా వైరస్ అన్నది ప్రమాదం కాదు. ఇదొక మహమ్మారి. యావత్ ప్రపంచాన్నే కబళించేస్తోంది. సమాజంలోని అన్నీ రంగాలు కుప్పకూలిపోయాయి. దాంతో ప్రపంచదేశాల ఆర్ధిక పరిస్ధితి తల్లకిందులైపోయింది. బాధితులకు, రోగులకు సౌకర్యాలు కల్సించటానికే ప్రభుత్వాలు నానా అవస్తలు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో చనిపోయిన ప్రతి ఒక్కళ్ళకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి ? అంత డబ్బు ప్రభుత్వం ఎక్కడి నుండి తెస్తుందనే కనీస ఇంగితం కూడా చంద్రబాబులో లోపించింది. డిమాండ్ రూపంలో బాధిత కుటుంబాలను ప్రభుత్వంపైకి రెచ్చగొట్టడమే చంద్రబాబు ఉద్దేశ్యంలాగ కనబడుతోంది.