అమెరికాలో చదువుకోవాలంటే ఇక 4 ఏళ్లే!.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం!
ఇప్పటివరకు అమెరికాలో స్టూడెంట్ వీసా (F-1) కింద విద్యార్థులు ‘duration of status’ నిబంధన ద్వారా తమ కోర్సు పూర్తయ్యే వరకు దేశంలో ఉండే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం, వీసా జారీ తేదీ నుంచి గరిష్ఠంగా 4 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు ఉండనుందని తెలుస్తోంది. కోర్సు పూర్తి కాకుండా వీసా గడువు ముగిస్తే, మళ్లీ పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని సమాచారం.
ఈ నిర్ణయం పీహెచ్‌డీ, మెడిసిన్, లాంగ్-ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లు చేస్తున్న విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా పరిశోధన కోర్సులు ఐదు, ఆరు ఏళ్లు పడుతుంటాయి. అటువంటి కోర్సుల్లో మధ్యలోనే వీసా రెన్యూవల్ చేయించుకోవలసిన భారం విద్యార్థులపై పడనుంది.
భారతదేశం నుండి ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు అమెరికాకు చదువుల కోసం వెళ్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు యూఎస్ యూనివర్సిటీలలో ప్రవేశం పొందుతుంటారు. ఈ నేపథ్యంలో కొత్త వీసా నిబంధనలపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా విదేశీ విధానంలో ఇమ్మిగ్రేషన్ కీలక అంశంగా మారిన నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనల్లో పలు మార్పులు చేస్తోంది. తాజా నిర్ణయం భారత విద్యా రంగానికి, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీలకు పెద్ద సవాలుగా మారనుంది. భారత ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాల్సిన అంశం.