ఏపీలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్.. చరిత్రాత్మక బంగారం తవ్వకాలకు నేడే భూమి పూజ!
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీ ఆర్థిక ప్రయోజనం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానిక యువతకు మైనింగ్, లాజిస్టిక్స్, ప్రాసెసింగ్ వంటి విభాగాల్లో నేరుగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ సంస్థలకు బంగారం, ఇతర విలువైన ఖనిజాల తవ్వకాలకు లైసెన్సులు మంజూరు చేస్తుండటంతో, ఈ రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా మైనింగ్ రంగంలో పారదర్శకత, పెట్టుబడిదారుల అనుకూల విధానాలతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ గోల్డ్ మైన్లో అధునాతన పర్యావరణ హిత సాంకేతికతలను వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భూగర్భ జలాలు, పంట భూములపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, స్థానిక గ్రామస్తుల సహకారంతోనే ప్రాజెక్టును ముందుకు నడిపిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
దేశీయంగా బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయ ఉత్పత్తి పెరిగితే విదేశీ మారక ద్రవ్యం ఆదాతో పాటు, దిగుమతుల భారం తగ్గుతుంది. ఏపీలో మొదలవుతున్న ఈ ప్రాజెక్టు, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద లాభం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.