ఇండియా vs ఆస్ట్రేలియా: ఫైనల్ పంచ్ లో ఇండియా పంజా విసురుతుందా ?

VAMSI
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్ డే ల సిరీస్ లో భాగంగా మొదటి రెండు వన్ డే లను చెరొకటి గెలుచుకోగా, సిరీస్ డ్రా గా ఉంది. చివరి వన్ డే చెన్నై వేదికగా జరగనుండగా అభిమానులు ఎంతో ఆతృతగా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తునారు. మరో రెండు రోజుల్లో సిరీస్ ను నిర్ణయించే మ్యాచ్ జరగనుంది. నిన్న ముగిసిన రెండవ వన్ డే లో టాస్ ఓడిన ఇండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 26 ఓవర్లకు 117 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. భారత్ ఆటగాళ్లలో కోహ్లీ ఒక్కడే 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఆస్ట్రేలియా పేస్ గన్ మిచెల్ స్టార్క్ మొదటి ఓవర్ నుండి నిప్పులు చెరిగే బంతులతో ఇండియాను వణికించాడు. మొదటి ఓవర్ లోనే శుబ్మాన్ గిల్ ను అవుట్ చేసిన స్టార్క్... ఆ తర్వాత రోహిత్ (13) , సూర్యకుమార్ యాదవ్ (0) లను వరుస బంతుల్లో అవుట్ చేసి ఇండియాను కోలుకోలేని దెబ్బ తీశాడు. క్రీజులో కుదురుకుంటూ ప్రమాదకరంగా మారుతున్న కోహ్లీని (31) నాథన్ ఎల్లిస్ అద్భుతమైన బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.  హార్దిక్ (1), జడేజా (16), కుల్దీప్ యాదవ్ (4) షమీ (0), సిరాజ్ (0) మరియు అక్షర్ పటేల్ (29) పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.  
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లతో నిప్పులు చెరగగా, అతనికి అబ్బాట్ 3 మరియు ఎల్లిస్ ల 2 వికెట్ల నుండి చక్కని సహకారం అందింది. ఈ స్కోర్ ను ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్ లలో వికెట్ నష్టపోకుండా ఛేదించి పది వికెట్లతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఓపెనర్లు హెడ్ (51) మరియు మిచెల్ మార్ష్ (66) పరుగులతో అర్ధసెంచరీలు సాధించి సిరీస్ ను 1 - 1తో సమం చేశారు. ఇప్పుడు సిరీస్ ను గెలుచుకోవాలంటే చెన్నై వన్ డే లో ఎవరు గెలిస్తే వారు... సిరీస్ ను గెలుచుకుంటారు. మరి ఇండియా ఈ ఓటమి నుండి కోలుకుని సత్తా చాటి సిరీస్ ను సాధిస్తారా అన్నది చూడాలి. ఇక మూడవ వన్ డే తో ఆస్ట్రేలియా పర్యటన ముగియనుంది. మరి ఫైనల్ పంచ్ లో ఇండియా పంజా విసురుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: