"వరల్డ్ కప్" గెలిచినంత సెలబ్రేషన్స్... ఫ్యాన్స్ షాక్ !

VAMSI
మహిళల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇండియా పర్యటనలో 5 టీ 20 ల సిరీస్ ను ఆడేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా మహిళల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఇండియాను మట్టికరిపించి సిరీస్ లో ఆధిక్యంలోకి వెళ్ళింది. కానీ నిన్న జరిగిన రెండవ మ్యాచ్ లో ఇండియా ధీటుగా ఆడి సూపర్ ఓవర్ లో గెలిచి సిరీస్ ను సమం చేసింది. మొదట టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది, బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుండే బౌలర్లపై విరుచుకుపడింది. కెప్టెన్ హీలీ దూకుడుగా ఆడే ప్రయత్నంలో 25 పరుగుల వద్ద దీప్తి శర్మ బౌలింగ్ లో అవుట్ అయింది.
కానీ ఆ తర్వాత మూనీ మరియు మెగ్రాత్ లు ఇండియా బౌలర్లను తుత్తునియలు చేశారు. వీరిద్దరూ ఏ ఒక్క బౌలర్ ని కూడా వదలకుండా గ్రౌండ్ కు నాలుగు వైపులా షాట్ లు ఆడుతూ ఇండియా ముందు 187 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మూనీ 82 పరుగులు మరియు మెగ్రాత్ 70 పరుగులు చేశారు. ఇక 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు ఓపెనర్లు ఇద్దరూ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు 76 పరుగులు జోడించాక వర్మ (34) అవుట్ అయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్మృతి మందన్న 79 మొక్కవోని దీక్షతో మ్యాచ్ ను గెలిపించడానికి ప్రయత్నం చేసింది.
కానీ చివరికి మ్యాచ్ ఎన్నో ఉత్కంఠ భరితమైన క్షణాల మధ్యన డ్రా అయింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి అయిదు పరుగులు కావాల్సిన సమయంలో బంతిని ఎంతో చాకచక్యంగా బౌండరీకి తరలించిన దేవికా వైద్య అద్భుతం చేసింది. తాను కెరీర్ లో ఆడుతోంది రెండవ మ్యాచ్ అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్నట్లు యార్కర్ బంతిని పాయింట్ దిశగా ఆడిన వైనం ఆటకే హైలైట్ అని చెప్పాలి. ఆ తర్వాత సూపర్ ఓవర్ లో ఇండియా 6 బంతుల్లో 20 పరుగులు చేయగా, బదులుగా ఆస్ట్రేలియా 16 పరుగులు చేసి ఓటమి పాలయింది. అయితే మ్యాచ్ అనంతరం ఇండియా ఆటగాళ్ల సెలెబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే... ఒక వరల్డ్ కప్ సాధిస్తే ఎంతలా ప్లేయర్స్ అందరూ ఫ్లాగ్ ను పట్టుకుని గ్రౌండ్ చుట్టూ తిరుగుతారో ఆ విధంగా చేయడం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది అని చెప్పాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: