వీల్ చైర్ నుంచే గురిపెట్టింది.. పసిడి పట్టింది..!

NAGARJUNA NAKKA
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత్ కు తొలి బంగారు పతకం దక్కింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఫైనల్ లో అవని లేఖారా విజయం సాధించింది. మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఫైనల్ లో 249.6స్కోర్ సాధించింది. ఇది వరల్డ్ రికార్డ్ కాదు.. పారాలింపిక్స్ లో ఇది ఇండియాకు నాలుగో పతకం.
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు గోల్డ్ మెడల్ తెచ్చిన అవని లేఖారా గతంలో చాలా కష్టాలు పడింది. 10ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో వెన్నుపూస విరిగిపోయింది. వీల్ చైర్ కే పరిమితమైంది. అయినా ఏదైనా సాధించాలని ఫిక్స్ అయింది. తండ్రి సూచనతో ఆర్చరీ, షూటింగ్ నేర్చుకుంది. ట్రైనింగ్ ప్రారంభించిన ఏడాదికే నేషనల్ ఛాంపియన్ షిప్ లో 3మెడల్స్ సాధించింది. అప్పటికి అవనికి సొంత రైఫిల్ లేదు.. కోచ్ కూడా లేడు. ఆత్మవిశ్వాసం తప్ప.
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం అందించిన షూటర్ అవని లేకారాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోడీ అవనిని అభినందించారు. గోల్డ్ మెడల్ కు ఆమె నిజంగా అర్హురాలనీ.. షూటింగ్ లో హార్డ్ వర్క్, అభిరుచి వల్లే ఇది సాధ్యమైందన్నారు. నిజంగా ఇది భారత క్రీడారంగానికి స్పెషల్ మూమెంట్ అని కామెంట్ చేశారు.
తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భారత క్రీడా ప్రపంచంలో ఇదొక అద్భుత ఘట్టమని కొనియాడారు. అవని లేఖారా.. చారిత్రాత్మక విజయం సాధించినందుకు.. ఇంకా పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న తొలి భారత మహిళగా నిలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తానికి అవని లేఖారా కృషికి దేశం మొత్తం గర్విస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మున్ముందు ఇంకా ఎన్నో పతకాలు సాధించి మన దేశ కీర్తిని ప్రపంచం వ్యాప్తంగా చాటాలని ఆకాంక్షిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: