హ్యాపీ బర్త్ డే : పి.టి ఉష పరుగులు చరిత్రలో నిలిచిపోయాయి..!

NAGARJUNA NAKKA
పిలావుళ్ళకండి తెక్కేపరంబిల్ ఉష. సింపుల్ గా పి.టి ఉష అని పిలుస్తారు. భారతదేశ దేశపు పరుగుల రాణిగా ఈ క్రీడాకారిణి సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. 1964వ సంవత్సరం జూన్ 27వ తేదీన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో జన్మించారు. 1979వ సంవత్సరం నుంచి ఇండియా తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని మన దేశానికి పలు విజయాలు అందించారు. పిటి ఉషకు వయోలి ఎక్స్ ప్రెస్ అనే ముద్దు పేరు ఉంది.
పి.టి ఉష.. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్ లో చేరి తన క్రీడా ప్రతిభను చాటారు. ఆ సమయంలో ప్రభుత్వం ఆమెకు 250రూపాయలు ఇచ్చి ప్రోత్సహించింది. పి.టి ఉషలోని ప్రతిభను గుర్తించిన కోచ్ నంబియార్ ఆమెను ఆ దిశగా ప్రోత్సహించారు. చాలా కాలం వరకు శిక్షణ ఇచ్చి పరుగుల రాణిగా తీర్చిదిద్దారు. పి.టి ఉష క్రీడారంగంలోకి దిగినపుడు మహిళా అథ్లెట్లు చాలా తక్కువగా ఉండేవారు. పైగా అథ్లెటిక్ డ్రస్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అంటే అదొక వింతగా భావించేవారు.    
1986 సియోల్ ఆసియా క్రీడలలో నాలుగు గోల్డ్ మెడల్స్,  ఒక సిల్వర్ మెడల్,  1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో 2 రజత పతకాలు, 1990 ఆసియాడ్ లో 3 రజత పతకాలు, 1994 ఆసియాడ్ లో ఒక సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. 1984లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఒలింపిక్ క్రీడలు జరిగాయి. అందులో పాల్గొన్న పి.టి ఉష సెమీఫైనల్స్ లో పథమస్థానానికి చేరి దేశ ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తించింది. కానీ పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే ఛాన్స్ మిస్ చేసుకుంది. కానీ ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రీడాజీవితంలో పి.టి ఉష మొత్తం 101 స్వర్ణ పతకాలను సాధించింది.
భారత ప్రభుత్వం పి.టి ఉష ప్రతిభను గుర్తించి 1984లో పద్మశ్రీ బిరుదుతో పాటు.. అర్జున పురస్కారాలతో సత్కరించింది. 1984, 1985, 1986, 1987, 1989 లలో ఆసియా అవార్డులో అత్తమ అథ్లెట్ గా అవార్డు సొంతం చేసుకుంది. 1984, 1985, 1989, 1990 లలో ఉత్తమ రైల్వే క్రీడాకారులకు ఇచ్చే మార్షల్ టిటో అవార్డు పొందింది. అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రదర్శనకు గాను 30 అంతర్జాతీయ అవార్డులు కైవసం చేసుకుంది. 1985, 1986 లలో ఉత్తమ అథ్లెటకు ఇచ్చే వరల్డ్ ట్రోఫీ అవార్డును స్వీకరించి క్రీడాలోకంలో తనకు తిరుగులేదని నిరూపించింది పి.టి ఉష.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: