మనసే మూలం.. కృష్ణుడు చెప్పిన ఈ విషయం తెలుసా?

Hareesh
ఒకసారి కృష్ణార్జునులు కలిసి ద్వారకా నగర వీదుల్లో వెళుతున్నారు. వారికి దారి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు.
సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు .మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.


మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న పాత కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు.
తెల్లారింది... చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు.
కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు – అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో.
లేదు అర్జునా... ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.


ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.
దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది.కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.


అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు.
నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది…దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు.అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేల సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.


ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు.
ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
కృష్ణా... నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.
అర్జునా... అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు.అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు.


నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.


ఒకరోజు భోజరాజు తన రాజధాని నగరం లో మారువేషం లో తిరుగు చుండగా ఒక అందగత్తెను చూశాడు. ఆమె బంతి తో ఆడుకుంటున్నది.బంతిని చేతితో నేలకేసి కొడుతూ ఆమె ఆడుకుంటూ వుంటే,ఆమె చెవికి అలంకరించుకున్న కలువపూవు జారి ఆమె కాళ్ళ మీద పడింది.ఈ దృశ్యం రాజుకు ఎంతో మనోహరంగా కనిపించింది.కాసేపు దూరం నుండే ఆనందంగా ఆ ఆటను తిలకించి తన మందిరానికి వెళ్ళిపోయాడు.. మరునాడు సభలో తన ఆస్థాన కవులకు ఆ బంతి ఆట దృశ్యం గురించి చెప్పి ఆ ఆటను వర్ణిస్తూ తలా ఒక శ్లోకం చెప్పమని కోరాడు. మొదట భవభూతి లేచాడు.ధాటీగా తోటక వృత్తం లో యిలా శ్లోకం చెప్పాడు


తోటక వృత్త మంటే "కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతనో" అన్నట్టు 'టటటా,టటటా.టటటా' అని వరుస 'స'గణాలతో సాగుతుంది)
విదితం, నను కందుక!,తే హృదయం
ప్రమదాధర సంగమ లుబ్ధ ఇతి
వనితాకర సాభి హతః
పతితః పతితః పునరుత్పతసి


 
తా:--ఓ బంతీ! నీ ఉద్దేశ్యం స్పష్టంగా తెలుస్తూ వుంది ఈ అందగత్తె ఆధారాలు
ముద్దుపెట్టుకోవాలని చాలా ఉత్సాహ పడుతున్నావు. అందుకే తామరపువ్వు లాంటి ఆమె చేతుల చేత దెబ్బలు తిని మాటి మాటి కీ క్రింద పడి కూడా లేస్తున్నావు.
(నను కందుక! ఓ బంతీ; తే-హృదయం-విదితం!=నీ హృదయమేమితో విదితమే!;
ప్రమదా-అధర-సంగమ -లుబ్ధ:-ఇతి =జవరాలి ఆధారాలను చేరాలని ఆశ పడుతున్నావు.అని;  వనితా-కర-తామరస-అభిహతః ఈ ఉవిద  కరకమలాల చేత కొట్టబడి కూడా పతితః పతితః =పదే పదే క్రింద పడి ;పునః - ఉత్పతసి=మళ్ళీపైకి  
లేస్తున్నావు. ఎంత చక్కటి ఉత్ప్రేక్ష.అని మెచ్చుకున్నాడు రాజు.
 
తరువాత వరరుచి లేచాడు.తన వర్ణన యిలా చెప్పాడు.
ఏకోపి త్రయ ఇవభాతి కందుకోయం,
కాన్తాయాః కరతల రాగ రక్త రక్తః
భూమౌ తచ్చరణ నఖాంశు గౌర గౌరః
ఖస్థః సన్ నయన మరీచి నీల నీలః

 
తా:--ఈ బంతి ఒక్కటే అయినా మూడు బంతుల్లాగా కనిపిస్తున్నది.ఆ కాంత చేతిలో
ఆమె అరచేతి యెర్రని కాంతుల వల్ల ఎర్రబడి యెర్రని బంతిగానూ,అదే బంతి భూమి మీద పడినప్పుడు ఆమె కాలిగోళ్ళ తెల్లని కాంతి లో తెల్లగానూ,ఆ బంతే పైకి లేచినప్పుడు ఆమె కన్నుల నీలికాంతులలో నల్లటి బంతిగానూ కనిపిస్తున్నది..
(అయం-కందుకః -ఏక-అపి-త్రయః -ఇవ-భాతి =ఈ బంతి ఒక్కటే అయినా -మూడు
బంతుల లాగ -ప్రకాశిస్తున్నది. కాన్తాయాః -కరతల-రాగ-రక్త-రక్తః =కాంత యొక్క
అరచేతి ఎర్రదనం చేత ఎర్రబడి యెర్రనిదిగా; భూమౌ-తత్ -చరణ-నఖ-అంశు- గౌర-
గౌరః యెర్రనిదిగా; భూమౌ-తత్ -చరణ-నఖ-అంశు- గౌర-గౌరః ;భూమిమీద పడ్డప్పుడు ఆమె చరణాల గోళ్ళ-కాంతికిరణాల చేత తెల్లబడి తెల్లదిగా;ఖస్థ - సన్ -   నయన-మరీచి-నీల-నీలః;ఆకాశం లో వున్నదై (పైకి లేచినప్పుడు)వున్నప్పుడు కన్నుల కాంతులచేత నల్లబడి నల్లనిదిగా)  ఇది మరీ బాగున్నది అన్నాడు భోజరాజు.
ఇంతలో కవికుల గురువు కాళిదాసు లేచి ఆ దృశ్యాన్ని యిలా వర్ణించాడు.
పయోధరాకార ధరో హి కందుకః
కరేణ రోషాదభిహన్యతే ముహు:
ఇతీవ నేత్రాకృతి భీతముత్పలం
స్త్రియః ప్రసాదాయ పపాత పాదయో:
ఆ బంతి ఆట చూస్తే, ఆమె చెవిలో వున్న కలువమొగ్గకు భయం వేసిందట. ఎందుకు?
తన పయోధరాలను ఆ బంతి అనుకరిస్తున్నదని కోపంతో ఈ జవరాలు పదే పదే
 చేతులతో కొట్టి దండిస్తున్నది.మరి కలువపూవునైన నేను ఆమె కన్నులను
అనుకరిస్తున్నాను కదా!తనను కూడా దండిస్తుందేమో నన్న భయంతోనే ఆ కలువ ఆమె
పాదాలమీద పడిపోయింది క్షమించమని.
(పయోధర-ఆకార -ధరః - కందుకః ;ఆమె పాలిండ్ల ఆకారం ధరించిన బంతి ;రోషాత్ -
కరేణ - ముహు:  - అభిహన్యతే - హి = కోపం తో చేత్తో మాటి మాటికీ కొట్ట బడుతుంది కదా! .ఇతి - ఇవ - అన్నట్టుగా,నేత్ర-ఆకృతి - భీతం - ఉత్పలం = కన్నుల ఆకారం లో వుండటం చేత భయపడ్డ కలువ పూవు: స్త్రియః - ప్రసాదాయ = ఆ స్త్రీ అనుగ్రహం కోసం:
 పాదయో:పపాత =కాళ్ళ మీద పడిపోయింది.
ఈ మూడు శ్లోకాలూ మరోసారి జాగ్రత్తగా చదివి ఎవరి వర్ణన ఎక్కువ మనోహరంగా వుందో పాఠకులే తేల్చుకోవాలి.
వర్ణన చేసిన కవులిద్దరూ కలువపువ్వు ఆ యువతీ కాళ్ళ మీద పడిపోయిన
విషయాన్నిస్పృశించ లేదు.ఆ పని  కాళిదాసు మాత్రమే చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: