హనుమతత్త్వం నమ్మి ఆచరించిన వారికి సర్వం శుభమే! నీలుని కథే ఒక రుజువు

హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజని సుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు. హనుమను మానస వాచా కర్మణా నమ్మి పూజిస్తే కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం గా నమ్ముతారు

శ్రీహనుమంతునికి సంబంధించిన ముఖ్యమైన పర్వదినాలు ముచ్చటగా మూడున్నాయి.

1. వైశాఖ బహుళ దశమినాడు వచ్చే హనుమజ్జయంతి.  


2. జ్యేష్ఠ శుద్ధ దశమి నాటి హనుమత్కల్యాణం.


3. మార్గశిర శుద్ధ త్రయోదశి నాటి హనుమద్వ్రతం.


మాసాల్లో మార్గశిరమాసం శ్రేష్ఠ మైనది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ‘మాసనాం మార్గశీర్షోహం’ అని చెప్పాడు. అలాంటి శ్రేష్ఠమాసం లో వస్తుందీ హనుమద్వ్రతం. హనుమద్వ్రతం చేయడం ద్వారా సమస్త కోరికలు నెరవేరుతాయి.

నీలుడు కథ అందుకు నిదర్శనంగా కనబడుతుంది. నీలుడు విభీషణుడి కుమారుడు. ఒకనాడు అతడు తండ్రితో,  “ప్రభూ! లంకా నగరంలో సకల సంపదలూ ఉన్నాయి. కానీ రాజాగృహంలో కానీ, లంకా రాజ్యంలో కానీ కల్పవృక్షం, కామధేనువు, చింతామణి లేవు. శ్రీరామచంద్రుని సేవ లో ధన్యుడవైన నీవు ఆ అమూల్య నిధుల్ని ఎందుకు పొందలేకపోయావు? అని ప్రశ్నించాడు.

అందుకు విభీషణుడు…. “కుమారా! శ్రీరాముని పాద పద్మాల సేవనే బ్రహ్మానంద సాగరంలో ఒలలాడే నాకు అలాంటి వాటిపై కోరిక కలగలేదు. ఆ శ్రీరాముని దయవల్ల దేవేంద్రాది దిక్పాలకులు కూడా నాకు వశులై ఉన్నారు. ఇక భూలోక వాసుల గురించి చెప్పనక్కర్లేదు. ఇక అల్ప ప్రయోజనకరాలైన చింతామణి లాంటివి నాకెందుకు” అన్నాడు.

పుత్రుడికి కీర్తి రావాలని ఆశించి, విభీషణుడు ఇలా అన్నాడు. “పుత్రా! నీలా! దేవలోకంలో కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ఎల్లప్పుడూ దేవతలా వద్దే ఉంటాయి. నీకు అవి కావాలనుకుంటే సాధించు. అందుకు గురుశుశ్రూష చేసి దేవతల్ని ఉపాసించాలి అని చెప్పాడు.నీలుడు తండ్రి మాటను శిరసావహించి తండ్రికి నమస్కరించి, గురువైన శుక్రాచార్యుని వద్దకు చేరి, పాదసేవ చేయడం, అవసరమైన ద్రవ్యాలు సమకూర్చడం వంటివి చేస్తూ గురువును సంతృప్తిపరిచాడు.

పది పన్నెండేళ్లు సేవించాక శుక్రాచార్యుడు సంతోషించి, నాయనా! నీ కోరిక ఏమిటి? అని ఆడిగాడు. నీలుడు తన కోరిక తెలియజేశాడు.

అంతట భార్గవుడు నీలా! అన్ని విద్యలకు రాణి అనదగిన మంత్ర విద్యనూ, కోరికలన్నింటిని తీర్చగలదానిని ఉపదేశిస్తాను. శ్రేష్టమైన వ్రతాన్ని ఉపదేశిస్తాను. వాటి వల్ల నీకు దివ్య రత్నాలు తప్పక లభిస్తాయన్నాడు. మృగశిరా నక్షత్రం అందుకు అనుకూలమైంది. ఆ మర్నాడు మృగశిర కావడంతో శుక్రాచార్యుడు పంచముఖాంజ నేయుని మంత్రాన్ని, సమస్త ప్రయోజనాలు నెరవేర్చగల హనుమద్వ్రత్వాన్ని ఉపదేశించాడు.

గురు ఆజ్ఞమేరకు నీలుడు హనుమద్వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించాడు. అందుకు సంతోషించిన హనుమంతుడు నీలుడికి సాక్షాత్కరించాడు. పరివార గణంతో సాక్షాత్కరించిన హనుమంతుని చూసిన నీలుడు లేచి ఎదురుగా నిలిచి అనేక స్తోత్రాలతో స్తుతించాడు.

నీలకృత స్తోత్రం గా ప్రశస్తి చెందిన, ఆ స్త్రోత్రాలకు సంతృప్తి చెందిన హనుమంతుడు. నీలా!  భక్తి ప్రపత్తుల వల్ల నా భక్తులలో శ్రేష్ఠుడివైనావు. నీ తండ్రి విభీషణుడు కూడా నాకు మంచి మిత్రుడే. నీవు కోరుకున్నవాటిని తప్పక ఈయగలను. రేపు అమరావతి వెళ్లి ఇంద్రుని జయించి, చింతామణి, కల్పవృక్షం, కామధేనువు పొందగలవు. అంతేకాదు, దేవతా స్త్రీలలో రత్నం లాంటిది, అందం వయశ్శీల సౌభాగ్యవతి అయిన వన సుందరిని కూడా పొందగలవు.

మృగశిరా నక్షత్రం నీకు నిలయం అవుతుంది. నీ పేరు మీద ఈ పురుషోత్తమ క్షేత్రం నీలాద్రిగా ఖ్యాతి పొందుతుంది అని అనేక వరాలిచ్చాడు. వ్రతం నిష్ఠతో ఆచరించినవారు నీలాగే వెంటనే కోరిన ఫలితం పొందగలరు అని చెప్పాడు. కాబట్టి హనుమద్వ్రతం ఆచరించడం వాళ్ళ కోరిన కోర్కెలు నెరవేరగలవని అర్ధమవుతుంది.

హనుమంతుడు నీలుని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. గురువైన శుక్రాచార్యుని పాదపద్మాలకు నమస్కరించి అనుమతి తీసుకుని వచ్చి, తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీశ్శులు స్వీకరించాడు. శత్రువుల్ని భయపెట్టని పరాక్రమం వ్యర్ధమని భావించి, ఒక దూతనుపిలిచి నీలుడు   ఇంద్రుడికి తన కోరిక గురించి కబురు పంపాడు.

కల్ప వృక్షాదుల్ని ఇవ్వడానికి ఇంద్రుడు తిరస్కరించి యుద్ధానికి తల పడ్డాడు. యుద్ధం భీకర రూపం దాల్చడంవల్ల బ్రహ్మ సాక్షాత్కరించి, నీలుని కి ఇంద్రునిచే చింతామణి, కల్పవృక్షం, కామధేనువులను ఇప్పించి వారి మధ్య సయోధ్య కుదిర్చాడు.

హనుమద్వ్రతం వల్ల సోమదత్తుడనే – చంద్రవంశ రాజేంద్రుడు పోయిన రాజ్యం సంపాదించుకున్నాడు. మాహిష్మతీ పురాన్ని సోమదత్తుడు పాలించేవాడు. అతడు పరాక్రమశాలే అయినా శత్రువులందరూ ఒక్కసారిగా వచ్చి అతడిని ఓడించారు. గత్యంతరం లేక సోమదత్తుడు రాణి దేవికతో కలసి అరణ్యంలో ప్రవేశించాడు.

రాజ్య భ్రష్టత, పుత్రా శోకానికి తోడు అంధత్వం కూడా కలిగింది. దేవకి సోమదత్తుని జాగ్రత్తగా గర్గముని ఆశ్రమానికి చేర్చింది. గర్గ మహా ముని పరిస్థితి తెలిసి కొని, ధైర్యం చెప్పి, జయసిద్ధి నిచ్చే హనుమద్వ్రతం ఉపదేశించాడు. గురువు ఆదేశం ప్రకారం సోమదత్తుడు భక్తి శ్రద్దలతో హనుమద్వ్రతం నిర్వహించాడు. అందుకు సంతుష్టుడైన ఆంజనేయుని సాక్షాత్కరించి, ఒక ఖడ్గం ప్రసాదించి, దాని ద్వారా శత్రువులను జయించి మరల రాజ్యం పొందగలవని అనుగ్రహించాడు. ఇలా హనుమద్వ్రతం ఆచరించిన వారికి అన్ని కష్టాలు తొలగించి, సమస్త కోరికలు నెరవేర్చగలదు.

అలాగే ఒక్కరోజులో శత్రువుల నందరిని జయించి, రాజ్యం పొందిన సోమ దత్తుడు తనకు కలిగిన సమస్త బాధల నుంచి బయట పడ్డాడు. గర్గ మహా మునిని రాజగురువుగా, పురోహితునిగా స్వీకరించి ధర్మబద్ధంగా మూడువందల ఏళ్లపాటు సామ్రాజ్యాన్ని పరిపాలించారు.

హనుమత్సదృశం దైవం – నాస్తి నాస్త్వేవ భూతవే – అనేవైన ప్రమాణేవ – జయ సిద్ధికరం పరమే హనుమంతునితో సమానమైన దైవం ఈ భూతలంలో లేదు. ఆ ప్రమాణం వల్లనే ఈ వ్రతం వాళ్ళ జయసిద్ధి నిశ్చయం. ఈ వ్రతాన్ని క్షేత్రాల్లో సామూహికంగా కూడా జరిపిస్తుంటారు. ఉద్యాపనతో పూర్తిచేయాలనుకొనేవారికి పడమూడేళ్లకు ఉద్యాపన.

అంజనా గర్భ సంభూత - రామకార్యార్థ సంభవ వరతోర కృతాభాస – రక్షమాం ప్రతి వత్సరమే అంటూ వ్రాత తోరం ధరించాలి. హనుమద్వ్రతం లో పూజించిన రక్షా ధరించడం వల్ల హానుమద్రక్షణ పొందగలం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: