విస్తుపోయిన పోతన: ఇప్పుడే కదండీ భోజనం చేసి వెళ్లారు. మళ్లీ భోజనం అంటున్నారేమిటి?

భోజనం వడ్డించమని అడిగాడు పోతన తన భార్యతో. ఆమె చోద్యంగా చూస్తూ
‘అదేమిటండీ! ఇప్పుడే కదండీ భోజనం చేసి వెళ్లారు. మళ్లీ భోజనం అంటున్నారు? మళ్లీ అప్పుడే ఆకలయిందా’ అని నవ్వుతూ అడిగింది ఆ సాధ్వీమణి.
దిగ్భ్రమ చెందాడు పోతన. ఇదేమిటి? ఈవిడ ఇలా చెబుతోంది అని విస్మయంగా చూశాడు భార్య వైపు.
‘నేను భోంచేశానా?’ అని అడిగాడు.
‘అవును. కూర్చుని ఒక పద్యం కాబోలు వ్రాశారు నేను భోజనం చేయమంటే చేశారు. మీరు తిన్నతర్వాత అలవాటు ప్రకారం, నేను మీరు తిన్న విస్తరిలోనే భోం చేశాను’ అంది.
‘ఏదీ నువ్వు తిన్న విస్తరి?’
‘బైట కుప్పతొట్లో వేశాను’ అంది ఇల్లాలు.
బయటికి వచ్చి కుప్పతొట్లో చూశాడు. అప్పుడే ఒక కుక్క ఆ విస్తరిని నోట కరుచుకొని దొరకకుండా పరుగెత్తింది. ఇంట్లోకి వచ్చి కూర్చుని తను వ్రాస్తున్న చోట కూర్చుని చూశాడు. అక్కడ ఒక త్రాటియాకుపైన-
“అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా 
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోప లో 
త్పల పర్యంక రమావినోదియగు నాపన్న ప్రపన్నుండు వి 
హ్వల నాగేంద్రము పాహిపాహి యన కుయ్యాలించి సంరంభియై”
మొసలితో యుద్ధం చేస్తూ శక్తులుడిగి చేష్టలుల కోల్పోయిన నాగేంద్రం అని పేరుగల గజశ్రేష్ఠుడు ఈ జగత్తును ఎవరు సృష్టించి పరిరక్షిస్తుంటారో వారు కాపాడాలి అని ‘ఎవ్వనిచే జనించు’ ‘జగమెవ్వని లోపల నుండు లీనమై’ అని అర్థిస్తుంది, ప్రార్థిస్తుంది,
అపుడు: ‘ఆ వైకుంఠ పుర సౌధంలో మూలన మందార వనామృత సౌరభంలో రమాదేవితో క్రీడిస్తున్న ఆపద్బాంధవుడైన మహావిష్ణువుకు ఆ గజేంద్రం యొక్క మొర విని, వెంటనే పూనుకుని ఉన్న పళాన ఆపద్రక్షకుడుపక్రమించినవాడై రక్షణకు!
దిగ్భ్రమతో పోతన కళ్ల వెంట ఆనందభాష్పాలు! ఆనందాతిరేకం! అంతలోనే దుఃఖాతిరేకం! పరుగు పరుగున వచ్చి దిగ్భ్రమతో నిశ్చేష్టుడైన పోతనను చూసి కుదుపుతూ
‘స్వామీ స్వామీ!’ అని పిలిచింది ఆ పతివ్రతామతల్లి.
తేరుకుని ఆమె భుజంపై తలవాల్చి మళ్లీ అమిత రోదనకు గురయ్యాడు పోతన. కాసేపు అతడిని దుఃఖింపనిచ్చి, ఆపైన ఓదారుస్తూ            
‘ఏం జరిగింది నాథా! ఎందుకంతగా దుఃఖిస్తున్నారు’ అని అడిగింది ఇల్లాలు.
‘శ్రీరామచంద్రుడు! శ్రీరాముని దర్శనభాగ్యం పొందావు నువ్వు! అనంత భాగ్యరాలివి! ధన్యాత్మవు. నాకా భాగ్యం కలుగలేదు’ అని చెపుతూ ఉన్నాడు పోతన. ఏడుస్తూ ఉన్నాడు మళ్లా వెంటనే దుఃఖాభ్యాగ్నుడై!
‘అవునా స్వామీ! నిజమా! ఇంత క్రితం వచ్చి వ్రాసి, భోజనం చేసి వెళ్లినవారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్రమూర్తియా?’
‘అవును దేవీ! ఇది శ్రీరాముల వారు తమ స్వహస్తాలతో వ్రాసిన పద్యం! విను’ అని ఆ పద్యాన్ని వెక్కిళ్ల మధ్యనే పాడుతూ, చెపుతూ, ఏడుస్తూ
‘చూడు - నువ్వు భగవంతుడి దర్శనం పొందావు - వారు వ్రాస్తున్నది చూశావు - నీ స్వహస్తాలతో భోజనం పెట్టావు, వారి స్పర్శనం పొందావు! నాకేదీ ఆ భాగ్యం? ఆ స్వామి తిన్న ఎంగిలాకును ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది కదా!’ అని మళ్లీ ఏడుస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు పోతన.
‘స్వామీ! మీరు తీవ్రమైన దుఃఖంతో ఆవేదన చెందుతున్నానరు. శ్రీరామచంద్రమూర్తి మీ రూపంలో వచ్చి, మీరు వ్రాసినట్లుగా వ్రాసి, మీరు తిన్నట్లుగా తిని, నాకు మహద్భాగ్యమైన అవకాశం ఇచ్చారు. మీరే తానై స్వామి వస్తే, మళ్లా మీకు దర్శనం ఇవ్వలేదని దుఃఖిస్తారేం?
ఇంత గొప్ప ‘మహా భాగవత కావ్యాన్ని’ తెనిగీకరిస్తున్న మీ అపూర్వమైన పాండిత్యం చూసి, ఆనందం పట్టలేక, మీ రచనలో తానూ పాలు పంచు కోవాలని నిశ్చయించుకుని, మీకు భ్రమ కలిగించి బయటకు పంపి, తాను మీ రూపంలో వచ్చి, ‘తనను గురించి తానే’ గొప్పగా వ్రాసుకున్నాడు. ఇంత మహాభాగ్యులు మీరు.
మీరు తెనిగీకరిస్తున్న‘మహాభాగవతం’ ఆచంద్రతారార్కం వర్దిల్లుతుంది. మీ రాముడు మీ లోపల ఆత్మారాముడై ఉన్నాడు.
దుఃఖంమాని, ప్రశాంతం గా కూర్చుని ధ్యానమగ్నులు కండి! మీకే అర్థం అవుతుంది’ అంది.
వెంటనే ధ్యానమగ్నుడయ్యాడు పోతనామాత్యుడు. తన ధ్యాసను భ్రూమధ్యం (భృకుటి) లో నిలిపి, తన ఉచ్ఛ్వాస నిశ్వాసలను తదేకంగా గమనిస్తూ అంతర్ముఖుడయాడు. తన హృదయ కుహరంలో కొలువైవున్న ఆత్మారాముడిని చూసి పరమానంద భరితుడయ్యాడు ‘రామదాసు’లాగా!
‘భవ సంతృప్తినీ, భావ సంతృప్తినీ పూర్తిగా పొందారు పోతన దంపతులు. ఏ మాత్రం భవ దారిద్య్రం కానీ, భావ దారిద్య్రం కానీ లేనివారు! ముక్తజీవులు! ధన్యులు! పుణ్యాత్ములు!
వీరభద్ర విజయం, భోగినీ దండకం పోతన ఇతర రచనలు. పరమ ప్రఖ్యాతి పొందినదీ, ప్రతి కవీ, పండితుడూ, ప్రతి సాహితీ ప్రియుడు పరవశించేది ‘మహాభాగవతం’! ఈ కావ్య అనువాదం, ఇందు లోని గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర అజరామరాలు. పోతన కలికి తురాయి మహాభాగతం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: