దసరా పండగనాడు జమ్మిచెట్టు ప్రాధాన్యత గురించి తెలుసుకోండి.. !!

Suma Kallamadi

           
దసరా వచ్చిందంటే చాలు అందరి ఇళ్లల్లో సంతోషాలు సంతరించుకుంటాయి.. నవరాత్రులను ఎంతో భక్తి శ్రద్దలతో ఆచరిస్తారు  అయితే  దసరా సంబరాలు ఆఖరి రోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది ఏంటంటే జమ్మిచెట్టు. దసర పండగకి జమ్మిచెట్టుకు ఎంతో అనుబందం ఉంది. ఈ జమ్మిచెట్టును దైవంగా కొలవడం మన హిందూ సంస్కృతిలో ఒక భాగం. దసరా సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారం కన్నా గొప్పగా  భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు.  అసలు ఈ దసరా  పండగకి, జమ్మి చెట్టుకీ మధ్య అనుబంధం ఏమిటి అన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకె ఆ విషయాలు ఈరోజు తెలుసుకుందాం.. !! జమ్మి చెట్టు తెలియని  భారతీయులు ఉండరు. ఎప్పుడో రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన వచ్చింది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే ‘అరణి’ని ఈ జమ్మితోనే రూపొందించేవారు.


అసలు దసరా పండగకి జమ్మి చెట్టుకి మధ్య సంబంధం గురించి తెలుసుకుంటే.. పాండవులు ఒక ఏడాదిపాటు అజ్ఞాతవాసంలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే వారు అజ్ఞాతవాసంకి  బయలు దేరినది ఈ విజయదశమి రోజునే.ఆ రోజునే పాండవులు వాళ్ళ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. మళ్ళీ తిరిగి అదే విజయ దశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారట. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే, వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది చెబుతారు. పైగా జమ్మిచెట్టుని స్త్రీస్వరూప శక్తిగా భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాములవారికి లభించబట్టే, ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారని ఒక నానుడి.

జమ్మి చెట్టుకి మన పురాణాలలోనూ, జీవితాలలోనూ ఇంతటి సంబంధం ఉండబట్టే దసరానాడున జమ్మిచెట్టుకి పూజలు చేస్తారు. పూజ ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అయితే ఈ జమ్మిచెట్టు వలన చాలా ఉపయోగాలే ఉన్నాయి. కానీ సిటీలో నివసించే వారికీ  జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే ప్రాణం. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవితి నాడు  పూజించే  పత్రాలలో జమ్మి చెట్టు పత్రాన్ని కూడా చేర్చారు.అలాగే శివుడి గుడిలో కూడా జమ్మిచెట్టు ఉంటుంది. భక్తులు గుడిలోకి ప్రవేశించేటప్పుడు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షణలు చేసి ఆకులను కళ్ళకు అద్దుకుని దర్శనానికి వెళతారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: