ఛీఛీ.. అంత సిగ్గులేని మాటలా.. ఆ సీఎంను పీకేయండి..?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో విలువలు క్రమంగా దిగజారుతున్నాయని తరచూ చెప్పుకుంటున్న మాటే.. కానీ.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. చివరకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా తమ హోదాలను మరచిపోయి.. ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడేస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్‌ గాంధీ గురించి అస్సాం సీఎం వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. రాహుల్ గాంధీకి తండ్రి రాజీవ్ గాంధీ ఒక్కడేనా అంటూ అస్సాం సీఎం కామెంట్ చేయడం వివాదాలకు కారణమైంది.

ఇష్టానుసారం రాహుల్ గాంధీ తండ్రిపై మాట్లాడిన అస్సాం సీఎంను బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓ సీఎం అయి ఉండి.. అంత సిగ్గులేని మాటలు ఎలా మాట్లాడతారని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  ప్రశ్నించారు. అస్సాం సీఎం వ్యాఖ్యలపై  దేశానికి మోదీ, భాజపా అధిష్టానం క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బీజేపీ ఈ దేశాన్ని ఏలుతున్నందుకు సిగ్గుగా ఉందన్నారు భట్టి విక్రమార్క. ఇదేనా బీజేపీ సంస్కృతి.. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్న భట్టి..  భారత సంస్కృతిపై గౌరవం ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను వెంటనే పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని అని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.

భారత సంస్కృతికి విరుద్ధంగా బీజేపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, భాజపా అగ్ర నాయకత్వం మొత్తం భారత జాతికి క్షమాపణలు చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. కేవలం బీజేపీ హైకమాండ్ మెప్పు కోసమే బీజేపీ సీఎం ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేశారని.. భట్టి విక్రమార్క విమర్శించారు. ఇలాంటి అడ్డగోలు విమర్శలు చేసినందుకు భవిష్యత్తులో బీజేపీ తగిన భారీ మూల్యం చెల్లించుకుంటుందని భట్టి విక్రమార్క హెచ్చరించారు.

అసోం సీఎం వ్యాఖ్యలపై ఇతర కాంగ్రెస్ నాయకులే కాదు.. కేసీఆర్‌ వంటి ఇతర పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు. బీజేపీ సీఎం వ్యాఖ్యలు విన్న తనకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయని కేసీఆర్‌ కామెంట్ చేశారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సీఎంపై బీజేపీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: