వీడి దుంప తెగ.. టార్గెట్‌ పెట్టుకుని మరీ చైన్లు కొట్టేశాడుగా..?

Chakravarthi Kalyan
మన సినిమాల్లో హీరోలు ఏంచేస్తారో.. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. చాలా సినిమాల్లో హీరోలంతా పోకిరిరాయుళ్లే.. అల్లర చిల్లరగా తిరగడమో.. దొంగతనాలు చేయడమో.. అమ్మాయిల వెంట పడి వేధించడమో.. ఇలా సాగుతాయి మన హీరోల కార్యకలాపాలు.. అయితే.. సినిమాలో ఎక్కడో ఓ ట్విస్టు పెట్టేసి.. అప్పటి నుంచి హీరోని కాస్త బాధ్యతాయుతంగా చేసేస్తారు. కథ ప్రకారం రూట్ మార్చేస్తారు.. అప్పుడు హీరో అమాంతం మంచి వాడు అయిపోతాడు.

కానీ.. నిజ జీవితంలో ఈ సినిమా ప్రభావమో.. ఏమో కానీ.. కొందరు దొంగనాయాళ్లు మాత్రం దొంగతనాల్లో తమ నైపుణ్యం మొత్తం ప్రదర్శించేస్తున్నారు. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగులు బాగా ఎక్కువయ్యాయి. ఓ బైక్ వేసుకోవడం.. హెల్మెట్‌ పెట్టుకోవడం.. ఎక్కడైనా ఒంటరిగా మహిళ కనిపిస్తే.. దగ్గరగా వెళ్లి.. మెడలో గొలుసు లాక్కుని వెళ్లిపోవడం.. ఇదే ఉపాధి హామీ అయిపోయింది కొందరు వెధవలకు. ఆడవాళ్ల మెడలో బంగారు గొలుసు అంటే కనీసం రూ. 50 వేలు ఒక్క స్నాచింగుతో దక్కినట్టే.

అయితే.. నిన్న హైదరాబాద్‌లో ఓ దొంగ ఏకంగా.. టార్గెట్ పెట్టుకుని మరీ వచ్చాడో ఏమో.. ఒక్కరోజులోనే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదు చోట్ల దొంగతనాలు చేశాడు. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఇలా గొలుసు పోగొట్టుకుని బాధిత మహిళల్లో ఒక ఎస్సై భార్య కూడా ఉందండోయ్..  హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో ఈ ఐదు చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి.

ఈ ఐదు ఘటనల సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు.. ఈ ఐదూ చేసింది ఒక్కడే అని నిర్థారించుకున్నారు. ఇప్పుడు ఈ ఘరానా దొంగ కోసం ఐదు కమీషనరేట్ల పోలీసులు వెదుకుతున్నారు. ఈ దొంగతనం జరిగిన తీరు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ముందు ఎక్కడ చేయాలి.. ఆ తర్వాత ఎక్కడ చేయాలి.. అనే విషయంలో చెయిన్ దొంగ పిచ్చ క్లారిటీతో ఉన్నాడట. అందుకే మహిళలు ఒంటరిగా బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: