తగ్గేదే లే : ఉద్యోగం పోయినా మీసం తగ్గించడట..?

Chakravarthi Kalyan
సింహా సినిమా చూశారుగా.. ఆ సినిమాలో బాలయ్య మీసం హైలెట్.. అలాగే.. సింగం సీరిస్‌లో హీరో సూర్య మీసాలు కూడా అలాగే ఉంటాయి. అలాంటి మీసకట్టుతో సూర్య చెలరేగిపోతుంటే ఫ్యాన్స్‌కు పూనకాలే వచ్చేశాయి.. మరి అలాంటి మీసకట్టు పెంచుకోవాలని ఆశపడిన ఓ కానిస్టేబుల్‌కు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. సింహా సినిమాలో బాలయ్యలా మీసాలు పెంచుకున్న ఓ కానిస్టేబుల్‌ను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

రాకేశ్‌ రాణా అనే పోలీసు కానిస్టేబుల్‌కు మీసాలు పొడుగ్గా పెంచుకోవడం అంటే చాలా ఇష్టం.  రాణా మెడ వరకు మీసాలు, జుత్తుతో విధులు హాజరయ్యారయ్యేవాడు. అయితే.. ఉన్నతాధికారులు ఇది పోలీసు నిబంధనలకు విరుద్దమని.. ఆ మీసాలు తగ్గించాలని ఆదేశించారు. పోలీసు  యూనిఫాం వేసుకున్న వ్యక్తి అలాంటి వేషధారణతో విధులకు హాజరు కాకూడదని అధికారులు స్పష్టం చేశారు.మరి బాలయ్య మీసాలు ఉన్నాయంటే.. ఆ పౌరుషం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది కదా.. అందుకే అబ్బే.. నేను తగ్గేదేలా అంటున్నాడట రాకేశ్ రాణా.. అందుకే..  నిబంధనలకు విరుద్దంగా మీసాలు, జుట్టు పెంచాడన్న కారణంతో ఆయన్ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

అయితే.. సస్పెన్షన్‌ ఆర్డర్‌ వచ్చినా రాకేశ్ రాణా మాత్రం మీసకట్టును తగ్గించేదే లేదు అని పట్టుబట్టాడు.. తాను చాలా కాలంగా మీసాలను పెంచుతున్నానని చెబుతున్నాడు. తన మీసాలు తన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని.. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని చెబుతున్నాడు. తాను ఎప్పుడూ యూనిఫాం లేకుండా విధులకు హాజరవలేదని.. ఇతర విషయాల్లో తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని రాకేశ్‌ రాణా చెబుతున్నాడు.  

మీసాల అంశంపై తాను న్యాయం కోసం కోర్టులకు వెళ్తాననని రాకేశ్ రాణా అంటున్నాడు. మీసాలు పెంచుకునే స్వేచ్ఛ కూడా లేకపోవడం ఏంటని ఆయన ఆవేదన చెందుతున్నాడు. అవును మరి.. తమిళ సినిమాల్లో చాలా మంది పోలీసులకు సింహాలో బాలయ్య టైపు మీసాలే ఉంటాయి. మరి అక్కడ మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఎందుకు ఉండవో.. పోలీసు నిబంధనలు కూడా రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారతాయా.. ఏమో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

job

సంబంధిత వార్తలు: