చిత్రం భళారే: కోడిపుంజు బర్త్‌ డే సెలబ్రేషన్స్‌..!

Chakravarthi Kalyan
పుట్టినరోజు.. చాలా మందికి ఈ వేడుకలంటే చాలా ఇష్టం.. ఇక పిల్లలైతే.. ఆ రోజు కోసం నెలల తరబడి ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు బర్త్ డే వస్తుందా..ఎప్పుడు అందరితో కలసి పుట్టిన రోజు వేడుకలు చేసుకుందామా అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అయితే.. ఇప్పుడు మనుషులవే కాదు.. పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు జరపడం చాలా చోట్ల జరుగుతోంది.

ప్రత్యేకించి తాము ప్రేమగా పెంచుకునే కుక్కలు, పిల్లులకు పుట్టిన రోజులు చేయడం చూశాం.. ఇలాంటి ట్రెండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. పెంపుడు జంతువుల్ని చాలా ప్రాణంగా చూసుకుంటున్నారు చాలామంది. అయితే.. ఇప్పుడు మరింత ప్రత్యేకంగా ఓ కోడిపుంజుకి హ్యాపీ బర్త్ డే చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హ్యాపీ బర్త్ డే కోసం కోడిపుంజును  అందంగా అలంకరించి పుట్టిన రోజు జరిపిన దృశ్యాలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇదిగో ఈ ఫోటోలో తెల్లతెల్లగా మిలమిలా మెరిసిపోతున్న  కోడి పుంజు పేరు కన్నయ్యగా చెబుతున్నారు. ఈ కోడి పుట్టిన రోజు కోసం కేక్ కూడా తెచ్చారు.  పిల్లా పెద్ద అందరినీ పిలిచి వేడుక జరుపుకున్నారు. అయితే.. ఎక్కువ చప్పుడు చేస్తే ఆ కోడిపుంజు భయపడుతుందని డీజే లాంటివి హంగామా చేయలేదు లెండి. ఒక చాకు తీసుకుని కోడి కాలితో కేక్‌ కట్ చేయించారు. ఈ కోడి పుంజును అల్లారుముద్దుగా పెంచుకుంటోందీ కుటుంబం. జీడిపప్పు, బాదం వంటి బలవర్థకమైన ఆహారం అందిస్తున్నట్టున్నారు కోడి పుంజు కూడా బలిష్టంగా ఉంది.

సాధారణంగా కోడి పుంజులను పందేల కోసం పెంచుతుంటారు. అలా పెంచే కోడి పుంజులకు కూడా బాగా తిండి పెడతారు. అయితే అదంతా కోడి పందేల్లో గెలుపు కోసం.. కానీ ఈ కుటుంబం మాత్రం దీన్ని పందేల కోసం పెంచడం లేదు. ఇంట్లో మనిషిగా పెంచుకుంటున్నారు. ఈ వేడుక చూసి గిట్టని వాళ్లు.. ఆకలితో అలమటించే మనుషులను పట్టించుకోరు కానీ.. ఇలా కోళ్లు కుక్కలకు పుట్టిన రోజులా అంటూ విస్తుపోతున్నారు. కానీ.. ఏం చేస్తాం.. ఎవరి ఇష్టం వారిది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: