వ్యంగ్యం : మా ఎన్నికలు ఓ అంతర్జాతీయ సమస్య!

RATNA KISHORE
మా ఎన్నికలు అన్నవి హైద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఎన్నికలు కావు. మీకు తెల్సుగా! అవి ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. అవి మాములూగా జరిగే ఎన్నికలు కానే కావు. ఎవ్వరో ఎవ్వరినో ప్రభావితం చేస్తూ, ప్రలోభపరుస్తూ జరిగే ఎన్నికలు అస్సలు కానే కావు. మా ఎన్నికలు అంటే నిజాయితీలో నిజాయితీ, నిజంలో నిజం, అబద్ధంలో అబద్ధం ఇలా ఏం అనుకుంటే అది అని రాసుకోండి. అటు చిరంజీవి, ఇటు పవన్ కల్యాణ్ మధ్యలో  మోహన్ బాబు నలిగిపోతున్నారు. ఆయన తన కొడుకు కోసం చేస్తున్నదంతా దేశ సేవ కోసమే. ఆయన తన కొడుకు కోసం చేస్తున్నదంతా అందరి మంచి కోసమే. అందరి కోసం ఒక్కడు అని అంటారే అదే ఇది! కానీ మోహన్ బాబు ఆ మాట బయటకు వెల్లడించారు. అస్సలు ఆ మాట ఎక్కడా అనరు కూడా! అలాంటి సంస్కారంలోనే ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నాడు. డు లేదా రు. ఆయన కూడా దేశ సేవే చేస్తున్నాడు. ఆయన మాత్రం తక్కువా! పేదలకు ఇళ్లు, పెద్దలకు పింఛన్లు అని చెప్పి చెప్పి విసుగెత్తించడం ఎందుకు అని..పాపం ఎదుటి వాళ్లను తిడుతున్నాడు. ఓ థియేటర్, ఓ కల్యాణ మండపం, ఓ భవనం అన్నీ కలిపి ఒకేసారి కడితే మీకేమయినా నష్టమా..లేదా మీకేమయినా అభ్యంతరమా అన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు. గతంలో పనిచేసిన అధ్యక్షులకూ, ఆయనకూ అదే తేడా! కాదు అంతే తేడా!


 ప్రకాశ్ రాజ్ వెనుక ఎవ్వరూ లేరు.. చిరంజీవి ఉన్నాడని అనుకుంటున్నారు కానీ అది అబద్ధం అని కొందరు నటులు అబద్ధాన్ని అబద్ధంలానే చూడమని మనకు చెవిలో పువ్వులు పెట్టి మరీ! చెబుతున్నారు. ఈ దశలో ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇచ్చి తన బాధ్యత నిరూపించాడు నాగబాబు. ఇంకేం ఆయనకు ఎదురులేదు అని మాత్రం అనుకోకండి. అలా అని విష్ణు బాబును అంత తక్కువ చూసి చూడకండి అని కూడా అంటున్నారు ఇంకొందరు నటులు. విష్ణు బాబు కార్మికులను కలిశాడు. వారితో ఛాయ్ తాగి, సమోసా తిని వారి కష్టం విని వెళ్లాడు. కానీ టీ తాగాక వాళ్లేం అన్నారో అన్నది తెలియదు. సమోసా తిన్నాక వాళ్లేం చెప్పారో కూడా తెలియదు. అయినా కూడా మా కు అధ్యక్ష పదవి  మాత్రం ఓ పెద్ద కిరీటం కాదని ముళ్ల కిరీటం అని మాత్రం వాళ్లే చెప్పి ఉంటారు.


చెప్పినా చెప్పకపోయినా విష్ణు వీటిని ఎలా అర్థం చేసుకోగలడని.! చిన్న పిల్లాడు ఆయనకూ, ప్రకాశ్ రాజ్ కూ యుద్ధం ఎలా ఉన్నా రేపటి వేళ ఎవరు గెలిచినా ఇండస్ట్రీ స్వీట్లు పంచుకుని తింటుంది. బిర్యానీ వండుకుని తింటుంది. హాయిగా పేదల సమస్యలు పరిష్కారం అయిపోయి ఖీర్ చేసుకుని అంతా పంచుకుని తింటారు. జరగనున్నది ఇదే. ప్రకాశ్ రాజ్ , మంచు విష్ణు లాంటి మంచి వాళ్ల కారణంగానే ఇండస్ట్రీకి మంచి రోజులు రానున్నాయి. ఇది మాత్రం మీరు వ్యంగ్యం అని అనుకోవద్దు. వినండి నా మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: