మేమింతే: ఒక్క పతకానికే ఉబ్బితబ్బిబ్బవుతాం..?

Chakravarthi Kalyan
మేమింతే.. ఒలింపిక్స్‌లో ఓ పతకం వస్తే చాలు.. పూనకంతో ఊగిపోతాం.. అది కాస్త స్వర్ణం అయితే ఇక మా ఆనందానికి అంతుండదు.. మా ఛానళ్లకు పూనకం వస్తుంది.. మా పత్రికలకు కవిత్వం వస్తుంది.. మా నేతలకు దాతృత్వం తన్నుకొస్తుంది.. వార్తాఛానళ్లలో బ్రేకింగుల మీద బ్రేకింగులు.. ఆ హడావిడి అంతా ఇంతాకాదు.. ఇక మా పత్రికలు తమ టాలెంట్ అంతా ఉపయోగించి ఫస్ట్ పేజీని అదరగొట్టేలా డిజైన్ చేస్తాయి.. మాస్ట్‌ హెడ్‌ను పక్కకు జరిపి మరీ అలరిస్తాయి.

మంచిదే.. ఓ దేశం ఒలింపిక్ పతకం సాధించడం ఆనందమే..కానీ.. మనది కోటి జనాభా ఉన్న చిన్న దేశం కాదు.. 130 కోట్ల బృహద్ భారత దేశం.. మన జనాభాకు తగ్గట్టు ఎన్ని పతకాలు రావాలి.. ఇప్పటి వరకూ మనకు ఒలింపిక్స్‌లో వచ్చిన అత్యధిక పతకాలు ఈసారే.. ఆ సంఖ్య 7 పతకాల పట్టికలో మన స్థానం 47.. మరి ఆ మొదటి 47 దేశాల్లో మనకంటే చిన్న దేశాలు.. మనతో ఏ విషయంలోనూ సాటి రాని దేశాలు ఎన్నో.. మరి ఎందుకు మనకీ దీనస్థితి.

ఎందుకంటే.. ఒలింపిక్‌ పతకం వస్తే పండుగలా భావించే మనం మన ఇంట్లో మాత్రం క్రీడాకారులను తయారు చేయనివ్వం.. పిల్లలు ఏదైనా ఆసక్తిగా ఆడతానంటే.. పోయి చదువుకో పో.. మొన్న టెస్టులో ఎన్ని మార్కులొచ్చాయి.. అంటూ వాళ్ల ఆసక్తిని అక్కడే చంపేస్తాం. ఇక మన స్కూళ్ల సంగతి చెప్పనక్కర్లేదు.. సరైన ఆటస్థలం ఉన్న స్కూళ్లు నూటికి పది కూడా ఉండవు. కాంక్రీట్ జంగిళ్లలో అంతస్తుల్లో సాగే మన స్కూళ్లలో ఆటలకు స్థానం ఏదీ..?

మన ప్రభుత్వాలూ అలాగే ఏడ్చాయి.. ఓ క్రీడాకారుడు తనంత తాను కష్టపడి ఏదో ఒక పతకం సాధిస్తే వాడిని గుర్తిస్తాయి.. నజరానాలు ప్రకటిస్తాయి తప్ప.. ఆ స్థాయి వరకూ మరింత మంది వెళ్లే విధానాలు మాత్రం రూపొందించవు. ఆటలు మానసిక ఆనందాన్నిస్తాయి.. పోటీ తత్వం పెంచుతాయి. క్రీడాస్ఫూర్తి అందిస్తాయి. కానీ.. మనకు ఆటలు పట్టవు.. అందుకే మనం ఒలింపిక్స్ లో ఓ పతకం వస్తే బ్రహ్మాండం బద్దలైనట్టు ఆనందిస్తాం. మేమింతే.. మేం మారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: