మేమింతే.. పతకం గెలిచినా.. కులమే చూస్తాం..!?

Chakravarthi Kalyan
మేమింతే.. మేం భారతీయులం.. మాకు అన్నింటి కంటే కులం, మతమే ప్రధానం.. దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఓ పథకం వచ్చిందనుకోండి.. ఆ తెచ్చిందెవరో చూస్తాం.. కొందరి పేర్లు చూడగానే తెలిసిపోతుంది.. ఆ వ్యక్తి కులం, మతం ఏమిటో.. అలాంటి వాళ్లతో మాకు ఇబ్బంది లేదు. వాళ్ల గురించి వెదికి శోధించాల్సిందేమీ లేదు.. కానీ కొందరు పేర్లు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. అలాంటి వాళ్ల కులం తెలుసుకోవాలంటే.. చాలా పరిశోధనే చేయాల్సి ఉంటుంది.

అయినా సరే.. మేం ఆ విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గేదేలేదు. ఓ ఘనత సాధించినా.. ఓ విజయం వరించినా.. ఓ దారుణం జరిగినా.. ఓ అరాచకం జరిగినా..ఏదైనా సరే.. ఎలాంటి విషయమైనా సరే.. ఓ వ్యక్తి వార్తల్లో హైలెట్ అయ్యాడనుకోండి.. మాకు ముందుగా గుర్తొచ్చేది కులమే.. ఆ వ్యక్తి మతమే.. ఎందుకంటే.. అప్పుడే కదా మేం అతన్ని ఎలా గౌరవించాలో తెలుసుకునేది.. ఆ వ్యక్తి కులం తెలిస్తేనే కదా.. మేం అతడిని ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకునేది.

ఓ వ్యక్తి కులం తెలుసుకోవడానికి గతంలో బాగా కష్టపడే వాళ్లం.. కానీ ఇప్పుడు మాకు గూగులమ్మ చాలా సాయం చేస్తోంది. అందుకే మేం మాకు కావాల్సిన వ్యక్తి గురించి ముందుగా అతని కులమేంటో చూసేస్తాం.. కావాలంటే దానికి కొన్ని గంటలు సమయం కేటాయిస్తాం.. తప్పదు కదా.. ఓ వ్యక్తి ప్రతిభను అంచనా వేసేందుకు మేం ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా.. మొత్తానికి ఎలాగోలా ఆ వ్యక్తి కులం తెలుసుకుంటాం.. ఇక ఆ తర్వాత మొదలవుతుంది మా ఆట.

ఆ వ్యక్తి మాకు అనుకూలమైన కులం వాడనుకో.. ఇక మా ప్రతాపం చూపిస్తాం.. అతని గొప్పదనం గురించి విపరీతంగా ప్రచారం చేస్తాం.. మరి అంతే కదా.. ఆ కులంలో పుట్టబట్టే కదా అతను ఆ ఘనత సాధించింది. అతని కారణంగా మా కుల గౌరవాన్ని మరింత పెంచుకుంటాం.. ఒకవేళ ఆ వ్యక్తి మాకు గిట్టని కులంవాడనుకో.. అతడు ఇండియా మెడల్ తెచ్చిన వాడే కానీ గాక.. అతని మెడలు వంచేలా బురద జల్లడం ప్రారంభిస్తాం.. ముందే చెప్పాను కదా.. మాకు కులమే ప్రధానం. అదే మా సర్వస్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: