హుజూరాబాద్‌ కాక: దళిత బంధు Vs దళిత దండోరా..?

Chakravarthi Kalyan
హుజూరాబాద్‌ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రాకుండానే కాక మొదలైంది. ఉపఎన్నికకు ఎన్నికల సంఘం తేదీలు నిర్ణయించకుండానే అక్కడ రాజకీయ ఎత్తుగడలు మహా జోరుగా సాగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీటు కోసం మళ్లీ ఆయన గానీ.. ఆయన భార్యగానీ పోటీలో దిగుతారన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక టీఆర్ఎస్‌లో అభ్యర్థి ఎవరన్నదానిపై క్లారిటీ లేకపోయినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూర్‌నగర్ లో గెలిచి తీరాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు.

అందుకే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాక ముందే.. కేసీఆర్ హుజూరాబాద్‌ ఉపఎన్నికలపై దృష్టి సారించారు. అక్కడి ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు జోరుగా ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఏకంగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామంటూ దళిత బంధు పథకం ప్రకటించారు. అసలు ఇలాంటి పథకం బహుశా దేశంలోనే ఎక్కడా లేకపోవచ్చు. ఏకంగా 10 లక్షల రూపాయల నగదు సాయం చేస్తామని చెప్పడంతో హుజూరాబాద్‌లో ఎన్నికల వేడి మొదలైంది.

కేవలం దళిత బంధు ఒక్కటే కాదు.. కేసీఆర్ త్వరలోనే గొర్రెల పంపిణీ కూడా హుజూరాబాద్‌ నుంచే మరోసారి ప్రారంభించనున్నారు. హూజూరాబాద్ కోసం ఎన్ని వేల కోట్లయినా భరిస్తామన్నట్టు కేసీఆర్ ముందుకెళ్తున్నారు. దీంతో కేసీఆర్ దూకుడుకు కాస్తయినా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే.. హుజూరాబాద్‌లో దళిత దండోరా పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు హుజూరాబాద్‌లో దళిత దండోరా కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అవినీతిపై నిరంతర పోరాటం చేస్తామంటోంది కాంగ్రెస్.

పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. దళిత బంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందంటున్న పీసీసీ ఆ మోసాలన్నింటినీ బయటపెట్టేందుకే దళిత దండోరా నిర్వహిస్తామంటోంది. ముందుగా దళిత దండోరాతో ప్రారంభించి.. ఆ తర్వాత గిరిజన దండోరా, బీసీ దండోరా కార్యక్రమాలు చేపడతామంటోంది. కేసీఆర్  ప్రభుత్వ అవినీతి, కోకాపేట భూముల వేలంపై నిరంతరం పోరాటం చేయాలని పీసీసీ భావిస్తోంది. ఇందుకు భావసారూప్యం కలిగిన వారిని కలసి పోరాడాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మరి దళిత దండోరాతో దళిత బంధు ఎన్నికల లబ్దిని అడ్డుకోగలరా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: