హెరాల్డ్ సెటైర్ : పవన్ పరిస్ధితి మరీ ఇలా తయారైందేమిటబ్బా ? నోరెత్తలేక పోతున్నాడే

Vijaya
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి మరీ ఇంత దయనీయంగా మారిపోతుదని ఎవరు అనుకోలేదు.  బిజెపికి మిత్రపక్షంగా మారిన తర్వాత ఏ విషయంలో కూడా పవన్ నోరెత్తేందుకు  అవకాశం లేకుండాపోయింది. ఇటు జగన్మోహన్ రెడ్డిపై మునుపటి లాగ ఎగిరెగిరి పడటం లేదు. అటు చంద్రబాబునాయుడును రక్షించేందుకు నోటికొచ్చినట్లు మాట్లాడేందుకు అవకాశమూ దొరకటం లేదు.  దాంతో బిజెపి మిత్రపక్షంగా బయటకు వచ్చేయలేక అలాగని సర్దుబాటు చేసుకుని మౌనంగా కూర్చోలేక నానా అవస్తలు పడుతున్నట్లు సమాచారం. అందుకనే పవన్ అసలు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నాడా లేదా అని జనసైనికులతో పాటు మామూలు జనాలకు కూడా డౌటనుమానం పెరిగిపోతోంది.



ఇంతకీ విషయం ఏమిటంటే బిజెపికి మిత్రపక్షంగా జత కట్టకముందు జగన్ పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవాడు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులకు కూడా విచిత్రంగా జగనే బాధ్యత వహించాలని డిమాండ్  చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. చంద్రబాబు మీద భక్తితో కళ్ళు మూసుకుపోయి జగన్ పై ఒంటిపై లేచిన విషయం అందరికీ తెలిసిందే. కర్నూలులో సుగాలి ప్రీతి అనే విద్యార్ధినిపై జరిగిన హత్యాచారం ఘటనకు జగన్ ప్రభుత్వానిదే బాధ్యతంటూ బహిరంగసభలో చెప్పిన విషయం అందరు చూసిందే. నిజానికి ఘటన జరిగింది 2016లో. అంటే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఘటన జరిగినపుడు ఏమీ మాట్లాడని పవన్ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీతి అంశంపై ఎంత గోల చేసింది అందరు చూసిందే. అలాగే కడప జిల్లా కోడూరులో మరో విద్యార్ధినిపై జరిగిన హత్యాచారానికి కూడా జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నాడు పవన్. ఈ ఘటన జరిగింది 2017లో. అప్పడు అధికారంలో ఎవరున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.



ఇలా చంద్రబాబు రక్షణకు పవన్ ఎంతగా తాపత్రయపడేవాడో అందరు చూసిందే. సరే పవన్ ఎన్ని విన్యాసాలు చేసినా చివరకు హిజ్ మాస్టర్ చంద్రబాబుకైతే ఘోర పరాజయం తప్పలేదు. ఆ తర్వాత పార్టీ ఉంటుందో ఊడిపోతుందో అని అనుకునే సమయంలో హఠాత్తుగా బిజెపితో పొత్తు పెట్టుకున్నాడు. ఏ ముహూర్తాన పొత్తు పెట్టుకున్నాడో కానీ అప్పటి నుండి జగన్ పై ఒంటికాలిపై లేవలేకపోతున్నాడు. అదే సమయంలో చంద్రబాబు రక్షణగా కూడా నోరెత్తే పరిస్ధితి లేకపోయింది. మరీ బిజెపి అధ్యక్షునిగా సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి పవన్ పరిస్ధితీ మరీ దయనీయంగా మారిపోయింది. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పలువురు నేతలను వీర్రాజు పార్టీ నుండి సస్పెండ్ చేసేస్తున్నాడు. అంటే నూరుశాతం చంద్రబాబు వ్యతిరేక లైన్ తీసుకున్న విషయం తెలిసిపోతోంది.



ఎప్పుడైతే చంద్రబాబు వ్యతిరేక లైనును బిజెపి తీసుకున్నదో అప్పటి నుండి చంద్రబాబుకు మద్దతుగా పవన్ ఏమీ మాట్లాడేందుకు లేకపోయింది. పైగా వీర్రాజు, జీవిఎల్ నరసింహారావు, రామ్ మాధవ్ లాంటి కొందరు చంద్రబాబును అవకాశం వచ్చినప్పుడల్లా దుమ్ము దులిపేస్తున్నారు. చంద్రబాబును చచ్చినపామని, టిడిపి రాజకీయంగా చనిపోయిందని..ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. వాటన్నింటినీ పవన్ వింటు నోరుమూసుకుని కూర్చోవాల్సొస్తోంది.  తన మాస్టర్ చంద్రబాబును మిత్రపక్షం నేతలు అంత ఘోరంగా తిడుతుంటే, విరుచుకుపడుతుంటే పాపం తట్టుకోలేక పోతున్నట్లున్నాడు. ఏదేమైనా బిజెపితో మిత్రపక్షంగా మారిన తర్వాత ఒక విధంగా పవన్ పరిస్ధితి కుడితిలో పడిన ఎలుకలాగ తయారైందనే చెప్పాలి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: