హెరాల్డ్ సెటైర్ :  ఆ ఉత్సవాల్లో చేసిన వ్యాఖ్యలే బాలయ్యను వెంటాడుతోందా ?

Vijaya
తెలుగుసినీ ఫీల్డు ప్రముఖులు ప్రభుత్వంలోని ముఖ్యులతో సమావేశం అవ్వటం ఇపుడు పెద్ద వివాదంగా మారింది. కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ తదితరాలను మళ్ళీ మొదలుపెట్టాలని సినీ పెద్దలు అనుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో ఆమధ్య చిరంజీవి, నాగార్జున అండ్ కో సమావేశమైంది. దానిపై నందమూరి బాలకృష్ణ ఓ రేంజిలో విరుచుకుపడ్డాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా స్ధాలాలను పంచుకునేందుకు మీటింగ్ పెట్టుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలతో సంచలనం మొదలైంది.

తర్వాత తాజాగా అమరావతికి వెళ్ళి మళ్ళీ అదే బృందం జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసింది. తాజా సమావేశంలో కూడా  బాలకృష్ణ లేదు. తనను పిలవకుండానే కొందరు సినీపెద్దలు సమావేశాలు జరుపుతున్నారనే మంట బాలయ్య మాటల్లో తెలిసిపోతోంది. ముఖ్యంగా ఇటువంటి సమావేశాలకు మెగాస్టార్ చిరంజీవి నాయకత్వం వహిస్తుండటాన్ని నటసింహం తట్టుకోలేకపోతున్నట్లు అర్ధమైపోతోంది. బాలకృష్ణకు చిరంజీవికి మధ్య పెద్దగా సఖ్యత లేదన్న విషయం ఈ సమావేశాలు, బాలయ్య వ్యాఖ్యలతో అందరికీ అర్ధమైపోయింది. అసలు ఈ పరిస్ధితి ఎందుకు వచ్చింది ? కారణం ఎవరు ? అన్నది ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న.

సుమారు ఓ నాలుగేళ్ళు వెనక్కు వెళ్ళితే అనంతపురం జిల్లాలోని హిందుపురంలో జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకోవాలి. అప్పట్లో హిందుపురంలో లేపాక్షి ఉత్సవాలను ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహించింది. బాలయ్య హిందుపురం ఎంఎల్ఏనే కాబట్టి ఉత్సవాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. ఆ ఉత్సవాలకు ఎవరెవరినో పిలిచారు. ఉత్సవాల సందర్భంగా చిరంజీవిని ఎందుకు ఆహ్వానించలేదని మీడియా బాలయ్యను అడిగింది.   మీడియాతో అడిగిన ప్రశ్నకు బాలయ్య బదులిస్తు ’ఎవరెవరిని పిలవాలో తనకు తెలుస’న్నాడు. ’ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదన్నది పూర్తిగా తనిష్టమే’ అంటూ చాలా గొప్పపని చేసినట్లు ప్రకటించుకున్నాడు.

అప్పట్లో ఈ వ్యాఖ్యలు కలకలం రేపినా చిరంజీవి మాత్రం నోరిప్పలేదు. సీన్ కట్ చేస్తే టిడిపి ఇపుడు ప్రతిపక్షంలో ఉంది. బాలయ్య ఉత్త సినీ నటుడు మాత్రమే. ఎంఎల్ఏ అనే హోదా తప్ప మరేమీ లేదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వంతో సినీ పెద్దల భేటిల విషయంలో మొదటి నుండి చిరంజీవే లీడ్ రోల్ పోషిస్తున్నాడు. తనంతట తానే లీడ్ తీసుకుని ఉండచ్చు లేదా ఎవరైనా లీడ్ తీసుకోమని అడిగుండవచ్చు.  ఏదేమైనా సినీ ప్రముఖల భేటిలు చిరంజీవి ఆధ్వర్యంలో జరగటం బాలకృష్ణ సహించలేకపోతున్నాడన్నది వాస్తవమని అర్ధమైపోతోంది.

టిడిపి అధికారంలో ఉన్నపుడు సినీ ప్రముఖుల్లో చాలామందిని బాలయ్య లెక్క చేయలేదని ప్రచారం ఉంది. మరలాంటపుడు ఇపుడు బాలయ్యను ఎవరు గుర్తిస్తారు ? అన్నది ప్రధాన ప్రశ్న. మొత్తానికి లేపాక్షి ఉత్సవాల సందర్భంగా బాలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే చిరంజీవితో అంతరానికి ప్రధాన కారణమని అర్ధమైపోతోంది. ఏదేమైనా ఇతరులపై మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో చిక్కుతు తప్పవనేందుకు అప్పటి బాలయ్య వ్యాఖ్యలే ఉదాహరణగా నిలుస్తోందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: