మంచిమాట: చేసిన సహాయం ఊరికే పోదు..

Divya
ఒకరోజు మల్లన్న ఎరువులు కొనడానికి చీకటిలోనే పట్నానికి బయలు దేరాడు. అవ్వ బుజ్జమ్మ ఒక మూటలో చద్ది అన్నం కట్టించి. ఇది నీవు ఒక్కడివే తినకు.. ఎవరికైనా కొంత పెట్టి నువ్వు తిను.. ఒకవేళ ఎవరూ లేనప్పుడు కనీసం ఏ జంతువుకో .. చీమ కైనా సరే కాస్తంత వేసి తిను అని చెప్పింది.
మల్లన్న త్వరత్వరగా బండి తోలుకొని వెళ్లి పట్నంలో ఎరువులు కొని తిరుగు ప్రయాణమయ్యాడు.. మధ్యలో చిన్న చిట్టడవి.. మధ్యలో పారుతున్న నదిని సమీపించగానే మల్లన్న కడుపులో ఎలకలు పరిగెత్తసాగాయి. బండి నిలిపి ఎద్దులకు గడ్డి వేసి తాను కూర్చుని అవ్వ ఇచ్చిన చద్ది మూట విప్పాడు . ఎవరికైనా కాస్తంత అయినా పెట్టి తినమని అవ్వ మాటలు గుర్తుకు వచ్చాయి. చుట్టూ చూసాడు ఎవరూ కనపడలేదు. వాడికి చెట్టు సమీపంలో ఉన్న ఒక చీమల పుట్ట కనిపించింది మల్లన్న కొంత అన్నం పక్కన ఉన్న ఒక రాతిపై ఉంచాడు.
మిగిలింది తాను తిని, నీరు తాగి చెట్టు నీడ నడుం వాల్చాడు. ఆ రాతి మీద అన్నం చూసిన కొన్ని కోతులు వచ్చి తిని చెట్టు కొమ్మలపై కూర్చున్నాయి. పుట్ట వద్ద ఉంచిన అన్నాన్ని కాకులు కావు కావు మని తమ మిత్రులను పిలిచి తినడం కొన్ని మెతుకులు చీమల నోట కరుచుకొని వెళ్లడం అంతా గమనిస్తూ మెల్లగా నిద్ర లోకి జారుకున్నాడు మల్లన్న
 
ఉన్నట్టుండి మెలుకువ వచ్చి చూడగా పుట్ట వద్ద ఉన్న నల్లత్రాచు.. పొడుస్తున్న కాకులు.. చుట్టుముట్టి కుడుతున్న చీమల గుంపులు .. పోరాడుతున్న కోతులు కనిపించాయి. తోటి ప్రాణులకు కొంచెం అన్నం పెట్టడం వల్ల కృతజ్ఞతతో ఆ నోరులేని మూగ జీవులు ఈరోజు తన ప్రాణాన్ని ఎలా కాపాడాయోచూసి ఆశ్చర్యం ఆనందం కలిగింది. నోరులేని ప్రాణులే ఇంత సాయం చేయగా నోరు వివేకం ,విచక్షణ ,జ్ఞానం ఉన్న మానవులు ఒకరికొకరు తప్పక సహాయం చేసుకుని తీరాల్సిందే.. తన అవ్వ చెప్పిన చిన్న మాటలో ఎంత అంతరార్థం దాగి ఉందో అనుకుంటూ మల్లన్న తన అవ్వకు విషయం చెప్పడానికి త్వర త్వరగా బండి తోలుకొని వెళ్ళసాగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: