మంచిమాట: ఉపాయం సరైనదైతే అందరికీ మంచే జరుగుతుంది..!!

Divya
భువనగిరి రాజ్యంలోని ఒక ఇరుకు వీధిలో నివాసముంటున్న హరికి కొత్త సమస్య వచ్చి పడింది. బత్తాయి పళ్ల వ్యాపారులు దండిగా ఉన్నారు. అమ్ముడు పోగా మిగిలిన చెడిపోయిన బత్తాయి లన్నింటిని వారు వీధుల్లోనే వదిలి వెళ్ళిపోయేవారు. మరికొందరైతే ఏకంగా మురుగుకాలువల్లో పార పోసేవారు. దాంతో కాలువల్లో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి కంపువాసన వచ్చేది. సాయంత్రమైతే చాలు దోమలు ప్రజల మీద దాడి చేసేవి వీటన్నింటిని భరిస్తూనే వీధి వాసులు కష్టంగా నివాసం ఉండాల్సి వచ్చేది.
ఇదిలా ఉండగా ఓ రోజు... రాజు దండోరా వేయించాడు.. కార్తీక పౌర్ణమి రోజున తను ఎప్పుడూ వినని వింత విషయాలు చెప్పిన వారికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో వింత విషయాలు చెప్పారు. కానీ రాజుకు ఏది నచ్చలేదు. తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని హరి కూడా బయలుదేరాడు. పోటీకి వచ్చిన వారిని ఒకరి తర్వాత మరొకరిని రాజమందిరంలోకి పిలిచారు. చివరిగా హరి వంతు వచ్చింది. వెళ్లి రాజుకు నమస్కరించి వినయంగా... మహారాజా..! నీకు జల పుష్పాల గురించి తెలిసే ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మా వీధిలో జల ఫలాలు కూడా ఉన్నాయి తెలుసా! అనుమానం ఉంటే మీరే స్వయంగా వచ్చి చూసుకోండి. నచ్చితే కొన్ని తీసుకోండి! అని చెప్పాడు.
రాజు ఆశ్చర్యంతో.. అదేంటి? జల ఫలాలు? ఎప్పుడు వీటిగురించి వినలేదే! అన్నాడు . వెంటనే హరి ని తీసుకొని మంది మార్బలంతో ఆ వీధి కెళ్లాడు. రాజు కుప్పలు తెప్పలుగా కాలువల్లో పేరుకుపోయి కుళ్ళి కంపుకొడుతున్న బత్తాయి పళ్ళు చూశాడు. ఇదిగో మహారాజా...! కాలువ నీటిలో తేలుతున్నాయి చూశారా... ఇవే జల ఫలాలు అని చెప్పాడు. హరి వీధి పరిస్థితిని చూసి రాజు కడుపులో దేవేసినట్టుంది. వెంటనే పారిశుధ్య సిబ్బందిని పిలిపించి ప్రతిరోజూ కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించాడు. వ్యాపారులను కూడా పాడైపోయిన మిగిలిపోయిన పండ్లను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించాడు. తనను ఆశ్చర్యపరచడంతో పాటు సున్నితమైన సమస్యను వ్యాఖ్యగా తనకు తెలియజేసిన హరికి రాజు బహుమతి అందించాడు. ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్య కు పరిష్కారం దొరకడంతో వీధి వాళ్లంతా కలిసి హరి కి సన్మానం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: