మంచిమాట: లాభాపేక్ష లేనిదే స్నేహం..!!

Divya
ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్లి షికారు చేయాలని అనిపించింది. వెంటనే అది నదీతీరానికి వెళ్ళి పచార్లు చేయడం ప్రారంభించింది. అలా చేస్తుండగా దానికి నీటిలో డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్లలో నుంచి పైకేగురుతూ కిందకి పడడం చూసి దానికి భలే ముచ్చటేసింది.. చాలా సేపు డాల్ఫిన్ ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సింహం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు.. నేలపై నేను మృగరాజును.. డాల్ఫిన్ తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? అనుకుంది.

అలా తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్ కు చెప్పింది. అది కూడా కాస్త ఆలోచించి.. సరేనంది. ఆ తరువాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి. ఇంతలో సింహం పైకి ఓ అడవి దున్న వచ్చింది. సింహం దానితో తీవ్రంగా పోరాడింది కానీ, నది తీరంలో ఇసుక ఎక్కువగా ఉండడంతో అంత బలంగా పోరాడలేకపోయింది. తనకు సాయం చేయమని డాల్ఫిన్ ను కోరింది. నేను నీటిలో ఏమైనా చేయగలను నేలమీదకు వస్తే  ఆశక్తురాలిని అని చెప్పి చూస్తూ ఉండిపోయింది. అలా కాసేపు సింహంతో పోరాడిన దున్న ఆఖరికి అలసిపోయి తన దారిన తాను వెళ్ళిపోయింది.

అప్పుడు డాల్ఫిన్ . మిత్రమా... నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను.. మన స్నేహానికి అర్థమేమిటి? నేను నీకు మిత్రుడిగా ఉండడానికి తగను అని బాధపడింది. అప్పుడు సింహం నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా. ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే.నేను కూడా సాయం చేయలేను. ఎందుకంటే నేను నేలపైనే బలవంతున్ని.. కానీ  నీటిలో కాదు.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సింహం డాల్ఫిన్ మంచి మిత్రులుగా వుండసాగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: