మంచిమాట: చెడ్డ వాళ్లని తెలిసినా..దగ్గరకు చేరనివ్వకూడదు..!

Divya
అడవిలో ఒక చెట్టు పై కొన్ని పక్షులు ఉండేవి. ఆ చెట్టు తొర్రలో కళ్లు కనిపించని ముసలి గ్రద్ద ఒకటి ఉండేది. అది మేత కోసం ప్రతిరోజు చాలా కష్టపడేది. ముసలి గ్రద్ద దీన పరిస్థితి చూసి మిగతా పక్షులన్నీ దాని దగ్గరకు వెళ్లి గ్రద్ద మామ ఎన్ని రోజులు ఇలా నీ మేత కోసం కష్ట పడతావు.. నువ్వు మా పిల్లలకి , మేము పెట్టే గుడ్లకి కాపలాగా ఉండు చాలు.. మేమే నీకు మంచీ మంచి ఆహారం తెస్తాం. అని చెప్పాయి.. అందుకు ముసలి గ్రద్ద కూడా సరేనంది.. ఆ రోజు నుంచి చెట్టు విడిచి వెళ్లకుండా గ్రద్ద ఆ పక్షి పిల్లల్ని, గుడ్లని రక్షిస్తూ ఉండేది.

ఇలా సంతోషంగా సాగుతూ వుండగా  ఒకరోజు పక్షుల పిల్లలను, వాటి  గుడ్లనూ తినాలని ఆ చెట్టు దగ్గరకు ఓ జిత్తులమారి  పిల్లి వచ్చింది. దాని చప్పుడు విన్న ముసలి గద్ద.... ఎవరక్కడ? అంటూ గట్టిగా అరిచింది..అప్పుడు జిత్తులమారి పిల్లి.. నేను.. నేను.. మహాశయా ..! మీ దర్శనానికి వచ్చాను. అంది పిల్లి.. ఆ గొంతువిన్న గ్రద్ద.. నువ్వా  దుర్మార్గుడా..! ఇక్కడకు  ఎందుకు వచ్చావు? వెళ్ళు వెళ్ళు అని గట్టిగా  గర్జించింది బదులుగా పిల్లి... నేను చెడ్డపనుల్ని మానేసి ఇప్పుడ మీలాంటి పెద్దలకు  సేవ చేయాలని వచ్చాను. నాకు ఆ  భాగ్యాన్ని ప్రసాదించండి మహాశయా..అని వినయంగా వేడుకుంది.

గ్రద్ద దాని మాటల్ని నమ్మి దాని దగ్గరకు చేరనిచ్చింది.కానీ మిగిలిన పక్షులకు ఈ సంగతి తెలియదు. ప్రతిరోజు పక్షులు లేని సమయంలో వచ్చి,  పక్షి పిల్లల్ని , గుడ్లనూ పిల్లి  తినేసి వాటి ఈకలను, ఎముకల్ని ముసలి గ్రద్ద నివసిస్తూ  ఉండే తోర్రలు వేసేది. గ్రద్ద  పాపం ఆ విషయాన్ని గమనించలేదు. తమ గుడ్లు, పిల్లలు క్రమంగా తగ్గిపోవడాన్ని తల్లి పక్షులు గుర్తించాయి. పక్షులు..ముసలి గ్రద్ద తినేస్తోందని వాటికి సందేహం కలిగింది. అవి సందేహించినట్లే పక్షి పిల్లల ఈకలూ, ఎముకలూ గ్రద్ద తోర్రలో కనిపించాయి.. దాంతో ముసలి గ్రద్ద తమ పిల్లల్ని తినేస్తోందని భావించిన  పక్షులు అన్ని  కలిసి గ్రద్దను పొడిచి , గోళ్లతో రక్కి చంపేశాయి
.చెడ్డ బుద్ధిగల పిల్లిని చేరదీయడం వల్ల గ్రద్ద చివరకు ప్రాణాల్ని పోగొట్టుకుంది. అందుకే దుష్టులకు ఎప్పుడూ  దూరంగా ఉండాలని పెద్దలు చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: