మంచిమాట: ఎంత చిన్న వారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయరాదు..!!

Divya
రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం వచ్చింది. ఇళ్లన్నీ నేలమట్టం కావడంతో గ్రామస్తులంతా ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దాంతో ఆ గ్రామం ఎలుకలకు స్థిరనివాసంగా మారిపోయింది. పైగా గ్రామంలో మనుషులు లేకపోవడంతో ఎలుకల సంఖ్య రోజు రోజుకి పెరగసాగింది. ఒకసారి ఆ ఊరిని ఆనుకుని ఉన్న అడవికి నీటి కరవు వచ్చింది. వాగులూ,వంకలూ ఎండిపోయాయి. నీళ్లు దొరక్క జంతువులన్నీ విలవిల లాడాయి. నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది. ఏనుగులు ఆ ఊరిలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా దారిలో వందల సంఖ్యలో ఎలుకలు వాటి కాళ్ళ కింద పడి నలిగిపోయాయి.

అది చూసి ఎలుకల రాజు ఏనుగుల దగ్గరకు వెళ్లి మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళ్తూ ఉండగా మా మిత్రులు మీ కాళ్ళ కింద పడి చని పోయారు. మీరు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు దయచేసి వేరే దారిలో వెళ్ళండి మేము కూడా మీకు అవసరం వచ్చినప్పుడు ఏదోవిధంగా సహాయ పడతాం. అని చెప్పాడు.. మేము తప్పకుండా వేరే మార్గం లోనే అడవికి వెళ్తాం అయితే మీలాంటి చిన్న జంతువుల నుంచి మాలాంటి పెద్ద జంతువులు ఎలాంటి సహాయాన్ని తీసుకోవు సరికదా ఆశించవు కూడా అని గర్వంగా పలికాయి ఏనుగులు..
అన్న మాట ప్రకారం వేరే మార్గం మీదగా అడవికి చేరుకున్నాయి. కొన్ని రోజుల తరువాత అడవిలో కొన్ని ఏనుగులు వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులకు వలలో ఉన్నవాటిని ఎలా రక్షించాలో తోచలేదు. ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు. వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్ళతో చక చక కొరికి వాటిని విడుదల చేసి విముక్తి కలిగించాయి.. ఎంత చిన్న వారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదని తెలుసుకున్న ఏనుగులు వాటికి క్షమాపణలు చెప్పి అతిధి మర్యాదలు చేసి మరి సాధనంపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: