మంచిమాట : దురాశ వల్ల ఎప్పటికైనా ఇబ్బందులే కలుగుతాయి..!

Divya
అనంతవరం ఊరికి కూతవేటుదూరంలో అడవి ఉంటుంది. పిల్లలంతా ఆ అడవికి వెళ్ళి కావాల్సిన పండ్లు, కాయలూ కోసుకొని తినేవారు. కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు. ఒకరోజు చంద్రయ్య అనే పిల్లాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. పండ్లన్ని చిటారు కొమ్మలకి ఉండటం వల్ల కోసుకోవడానికి చేతకాలేదు. ఎండలో చాలాసేపు తిరిగి చివరికో చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు.
     
అంతలో అక్కడికి కోతుల గుంపు ఒకటి వచ్చింది. అతడిని చూసి.... పాపం పండ్ల కోసం వచ్చినట్టున్నాడు. మనం సాయం చేద్దాం అందొక కోతి..సరేనన్నాయి మిగిలిన కోతులు.. పెద్దవి చెట్టు మీదకు వెళ్లి , చిటారు కొమ్మన్ని కదిపి పండ్లు కింద పడేలా చేస్తే, చిన్నవి వాటిని సంచిలో వేశాయి. తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి. కొద్దిసేపటికి చంద్రయ్యకు మెలకువ వచ్చి చూస్తే , తన చుట్టూ సంచి నిండా పండ్లు ఉన్నాయి. దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు. కొన్ని తిని సంచితో పండ్లను తీసుకొని ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. ఇది విని సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ  బాగా పండ్లు ఉన్న ఒక పెద్ద చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయినట్లుగా నటించాడు. అతడు కోరుకున్నట్లే కొద్దిసేపటి తర్వాత కోతులు వచ్చాయి. సుబ్బయ్య కి సాయం చేయాలనుకున్నాయి.

కొన్ని చెట్టుపైకి ఎక్కి పండ్లు కోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి. ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో చూద్దామని ఒక కన్ను తెరిచాడు సుబ్బయ్య. ఒక పిల్ల కోతి దీన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది. అతడు తమను మోసం చేస్తున్నాడు అని అర్థమయ్యి మీదకు దూకాయి. ఇది గమనించి సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగు అందుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్దాయన కోతుల్ని తరిమి అతడిని రక్షించాడు. జరిగింది తెలుసుకుని సుబ్బయ్యని మందలించాడు. దురాశ దుఃఖానికి చేటు అని చెప్పి తన కష్టాన్ని తాను నమ్ముకోవాలి అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: