మంచి మాట: ఇతరుల ద్వారా వచ్చేది ఏదీ కూడా మన సొంతం కాదు..!

Divya
అనగనగా పూర్వం ఒక ఆశ్రమంలో ఒక రుషి నివసిస్తూ ఉండేవాడు. ఆయన ఎన్నో ఏళ్ల తరబడి ఘోర తపస్సు చేసి బతికి ఉన్నన్నాళ్లు యవ్వనంతో ఉండేలా వరాన్ని పొందాడు. తన తపస్సు ముగించుకున్న తరువాత గురుకులాన్ని స్థాపించి, పిల్లలకు విద్య నేర్పించడం మొదలుపెట్టాడు. విద్యార్థులు ఎంతో బుద్ధిగా ఆయన దగ్గర పాఠాలు నేర్చుకునే వాళ్ళు. ఆయనకు శ్రద్ధగా సపర్యలు కూడా చేసే వాళ్లు. ఒక్క శాస్త్ర విద్యలే కాకుండా జీవన విధానం గురించి కూడా మంచి మంచి విషయాలు చెప్పేవాడు గురువు.
ఒకరోజు అక్కడి పిల్లల్లో ఇద్దరికీ ఒక అనుమానం వచ్చింది.... 'మన గురువు గారు ఇక్కడ ఎప్పటినుంచో ఉన్నారు కదా..! మరి ఆయనలో వృద్ధాప్యఛాయలు కనిపించడం లేదేంటి'అని అనుకుంటూ.. ఆ మాటను వెంటనే ఆయనే అడిగారు. దానికి గురువు తాను చేసిన తపస్సు గురించి వివరించి అప్పుడు వరంగా పొందిన ఒక మంత్రాన్ని ఏకాంతంలో తాను రోజు జపించడంవల్లే ఇలా ఉన్నానని చెప్పాడు.

ఇక గురువు దగ్గర నుంచి ఎలాగైనా ఆ మంత్రాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళిద్దరూ ఆయన ఆ మంత్రం చదువుతుండగా దొంగ చాటుగా విని వాళ్లు చదవటం ప్రారంభించారు. కానీ వెంటనే ఇద్దరూ ముసలి వాళ్ళ లాగా మారిపోయారు. ఏడుస్తూ గురువుగారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. గురువు ఆ పని చేసినందుకు ఆగ్రహించాడు. తర్వాత శాంతించి వాళ్ళిద్దరినీ మామూలుగా చేసే మంత్రాన్ని ఉపదేశించాడు. 'ఒకరి శ్రమ ఫలాన్ని మనం పొందాలనుకోవడం తప్పు, ఇలా చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి.

మీకు ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించటానికి ఏం కావాలో తెలుసుకుని ఆ దారి లో వెళ్లాలి తప్ప దొంగ దారిలో ఫలితాన్ని పొందాలనుకోకూడదు అని మందలించి పంపించాడు. అప్పటి నుంచి ఆ గురుకులంలోని పిల్లలు తమకు కావాలన్నా కష్టపడి సాధించుకోవడం అలవాటు చేసుకున్నారు. కాబట్టి ఎవరికైనా ఏదైనా కావాలి అంటే సొంతంగా కష్టపడి ఫలితం పొందాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: