మంచిమాట: బహుశా స్నేహానికి తారతమ్యాలు ఉండవేమో..?

Divya
అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవంతా కలియ తిరుగుతు ఉండేది.
   
 అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్లి "ఏనుగూ! ఏనుగూ! నాకు నీతో స్నేహం చేయాలని ఉంది"అని చెప్పింది.
   
 ఆ మాటలతో ఏనుగుకు బోలెడంత కోపం వచ్చింది.
 "ఛీ! ఛీ ! నా కాలిలో ముళ్లంత లేవు. నీకు నాతో స్నేహం కావాలా. పో అవతలకి"అని కసిరి కొట్టింది.
దాంతో ఎలుకకు రోషం వచ్చింది. "నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు! నువ్వు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను, నీకు తోక ఉంది. నీకు కళ్ళు , చెవులు ఉన్నాయి. నాకు కళ్ళు, చెవులు ఉన్నాయి. ఇద్దరికీ తేడా ఏముంది?"అని అడిగింది.
"నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీవంటి అల్పజీవితో నేను స్నేహం చేయను"అని ఏనుగు వెళ్ళిపోయింది.
అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్నచోటనే తిరుగాడ సాగింది. ఒకరోజు అడవిలో ఏనుగును పట్టుకునే వాళ్లు వచ్చి పెద్ద వలవేసి ఏనుగును పట్టుకున్నారు."రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకు పోదాం"అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు.
"వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తుండగా ఎలుక వచ్చి "అయ్యో! ఏడవకు నేను నా మిత్రులను తీసుకువచ్చి నీకు బంధవిముక్తి కలిగిస్తాను"అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకలను తీసుకొచ్చింది. అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగును విడిపించాయి.
అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపుమీద ఎక్కించుకొని సరదాగా అడవంతా తిరిగేది.
వేటగాళ్లు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఎలుక వల తాళ్లను కొరికేసి ఏనుగును రక్షించేది. స్నేహం అనేది ఎవరి మధ్య అయినా ఎప్పుడైనా కలగవచ్చు. కాబట్టి ఎవరిని చిన్నచూపు కానీ తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అందరికీ పనికి వస్తారు. కాబట్టి స్నేహం చేస్తాను అని వచ్చినప్పుడు వారి గురించి ఆలోచించి స్నేహం చేస్తే అన్ని విధాలా లాభమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: