మంచిమాట: సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపదనుండి అయిననూ బయట పడవచ్చు..!
ఒకరోజు నక్క తాబేలుతో "నీవు ఎంత సేపు అలా నీటిలో ఉంటావు? నీవు బయటకు వస్తే, మనం కాసేపు ఎంచక్కా అడవంతా తిరిగి ఆడుకొని మళ్లీ రావచ్చు!"అంది. తాబేలుకు కూడా 'నిజమే' అనిపించింది. దానికి కూడా ఎప్పుడూ నీటిలో ఉండటం విసుగ్గానే ఉంది. అందుకే నక్క మాటలకు తాబేలు బదులు చెప్పలేదు. వెంటనే ఒప్పుకుంది. ఇద్దరూ బయటకు వచ్చి అలా అడవిలో నడవడం మొదలు పెట్టారు. ఇంతలో ఎక్కడి నుండో ఒక చిరుతపులి వచ్చింది. దాన్ని చూడగానే నక్క ప్రాణ భయంతో ఒక గుహ లోకి పారిపోయింది. కానీ తాబేలు వేగంగా నడవలేదు కాబట్టి, నెమ్మదిగా నడుస్తుండగా ఆ చిరుత పులి వెంటనే తాబేలు ఒడిసి పట్టుకుంది. తినాలని దానిని కొరికి చూసింది. కానీ తాబేలు శరీరం గట్టిగా, రాయి లాగా ఉంది కాబట్టి, దానికి కొరకడం వీలు పడలేదు.
వెంటనే తాబేలుకు ఒక ఆలోచన వచ్చింది. చిరుత పులి తో "నేను నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాను. కానీ నేను నేల మీద చాలా సేపటినుండి తిరుగుతున్నాను. కాబట్టి ఇలా గట్టిగా అయ్యాను. నన్ను కాసేపు నీటిలో నానబెట్టి మెత్తగా అయ్యాక తిను"అంది. ఆ మాటలు చిరుత పులి కి నచ్చాయి. కానీ, నీటిలో తాబేలు తప్పించుకుంటుందని అనుమానం వచ్చింది.
అయితే చిరుతపులి అనుమానాన్ని గ్రహించి తాబేలు "నన్ను నీ కాలితో గట్టిగా పట్టుకోని, నీటిలో నానబెట్టు"అని చెప్పింది. దాంతో చిరుతపులి సరేనన్నది. తాబేలును తన కాలితో పట్టుకుని నీటిలో కాసేపు ఉంచింది.
కొంతసేపటి తరువాత తాబేలుతో 'నానావా?'అని అడిగింది. "అంతా నానాను కానీ, నువ్వు కాలు పెట్టిన చోట మాత్రం నాన లేదు!"అని చెప్పింది. అంతే ముందు వెనకా ఆలోచించకుండా చిరుతపులి వెంటనే తాబేలు పై నుండి కాలిని తీసింది. ఇంకేముంది? తాబేలు హాయిగా నీటిలో మునిగి, చిరుత పులి బారి నుండి తప్పించుకుంది.