మంచిమాట: అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు లభిస్తాయి..
వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్ కు పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరికింది. ఆ పుస్తకాన్ని అటూ ఇటూ తిరిగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు. ఆ పేజీలో ఇలా ఉంది.." గంగా నది ఒడ్డున ఒక ప్రాంతంలో మహిమలు ఉన్న రాళ్ళు ఉంటాయని ,స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో, ఏ వస్తువుని తాకిన అది బంగారం అవుతుందని .." అక్కడ రాసి ఉంది. వెంటనే పుస్తకంలో రాసిన ప్రదేశానికి వెళ్లి రాళ్ళ కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్..
తన మనసులో ఒక్క రాయి దొరికినా చాలు.. నా జీవితం మారిపోతుంది అని ఆశ కలిగింది. నది ఒడ్డున దాదాపు ఏడు రోజుల పాటు శ్రమించినప్పటికీ, అతను ఆ విలువైన రాయిని గుర్తించలేకపోయాడు. అయినా వదలకుండా వెతుకుతూనే అలా రెండు వారాలు గడిచాయి.. అయినప్పటికీ కృష్ణమోహన్ ఆ రాయి జాడను కనిపెట్టలేక పోయాడు. జీవితాన్ని మార్చేస్తుంది అనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు. ఒక్కో రాయిని తాకి చూసి , అది వెచ్చగా లేకుంటే కోపంతో దానిని నదిలోకి విసిరేస్తూ ఉండేవాడు. చివరికి అతనికి అది అలవాటుగా మారింది.
వెతగ్గా వెతగ్గా ఒకరోజు ఒక మహిమలు ఉన్న రాయి అతని చేతికి దొరికింది. అది అతను గుర్తించలేక అలవాటు ప్రకారం నదిలోకి విసిరేశాడు. చేతి నుంచి జారి పోయే ఆఖరి క్షణం లో గానీ అతను విషయం గమనించలేకపోయారు. అప్పటికే జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయింది. కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయింది. అవకాశాలు అనేవి అరుదుగా వస్తుంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించాలి సద్వినియోగం చేసుకోవాలి.. తప్ప ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన చేజారిపోతాయి.