మంచిమాట: మూర్ఖులతో అనవసర ప్రసంగాలు చేయరాదు..
మూర్ఖులకు, దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీరితో అనవసర ప్రసంగాలు చేయడం వల్ల భవిష్యత్తులో ముప్పు ఎదురవుతుంది. అయితే ఇలాంటి వారికి మనం దగ్గరగా ఉండడం వల్ల ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ ఒక కథ రూపంలో చదివి తెలుసుకుందాం..
అనగనగా ఒక అడవిలో ఒక గొర్రె పిల్ల దాహం తీర్చుకోవడానికి దగ్గర్లో ఉన్న కాలువ దగ్గరికి వచ్చింది. ఇక ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇక ఈ విషయం తెలిసిన గొర్రెపిల్ల భయపడుతూ గబగబా నీటిని తాగుతూ ఉంది. ఇక దాని కంటే ముందు వచ్చిన నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతూ ఉంది. ఎక్కడ ఏ క్రూరమృగము వచ్చి, తనను తినేస్తుందేమో అని భయంతో, కంగారుతో అక్కడున్న నక్కను ఆ గొర్రె పిల్ల గమనించలేదు. ఇక ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూసిన నక్క ఒక్కసారిగా ఓయ్..! ఆగు.. నీవు తాగితే నీరు అపరిశుభ్రం అవుతుంది అంటూ అరిచింది.
అప్పుడు గొర్రెపిల్ల అయ్యో నక్క మామ..! నీళ్ళు నీ వైపు నుంచి ఇక్కడికి పారుతున్నాయి. నువ్వు తాగే నీళ్ళు నేను ఎలా పాడు చేస్తాను అంటూ అమాయకంగా అడిగింది గొర్రెపిల్ల. ఆ మాటలు నిజమే కానీ ,ఆ మాట ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు. నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం. ఓహో..! ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నీవే కదా..! అని అడిగింది నక్క. లేదు.. నక్క మామ. నేను అప్పటికి ఇంకా పుట్టలేదు అని చెప్పింది గొర్రెపిల్ల. ఇక ఆ మాటలు విన్న నక్కకు పట్టలేనంత కోపం వచ్చింది. అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్న మాట అంటూ అనసాగింది నక్క.
అయితే అప్పుడు నీవు..మీ అమ్మ కడుపులోనే కదా ఉన్నావు. మీ అమ్మ నాతో గొడవ పడింది అంటే నువ్వు కూడా నాతో గొడవ పడినట్లు. అయితే నీకు తప్పకుండా శిక్ష పడాలి అని అంది నక్క. ఇక ఆలోచించకుండా, సమయం ఇవ్వకుండా వెంటనే గబాలున గొర్రెపిల్ల పైన దూకింది నక్క. ఇక అక్కడి నుంచి తప్పించుకునే దారి లేక గొర్రె పిల్ల అక్కడికక్కడే మరణించింది . కానీ నక్కతో గొర్రెపిల్ల ఎక్కువ సమయం మాట్లాడకుండా ఉంటే ,అది చనిపోయే పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి మూర్ఖులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.