మంచిమాట: పొగడ్తలు ఎప్పుడూ పరుల స్వార్ధానికేనని గుర్తుంచుకోవాలి..
అనగనగా ఒక రోజు ఒక కాకికి మాంసం ముక్క దొరికింది. కాకి మాంసం ముక్క తీసుకుని ఒక చెట్టు మీద వాలి హాయిగాతిందాం అనుకుంది. అదే సమయంలో ఒక నక్క అటునుండి పోతూ, చెట్టు పైన ఉన్న కాకి ని, దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను చూసింది. పొద్దున్నుండి ఆహారం కోసం వెతుకుతున్న నక్కకు, ఆ మాంసం ముక్కను చూసి నోరూరింది. ఎలాగైనా సరే కాకి నోట్లో ఉన్న ముక్కను తినాలనుకుంది. నక్క జిత్తుల మారిది కాబట్టి ఏదైనా ఒక పన్నాగం పన్ని, కాకి నోటిలో ఉన్న ముక్కను తీసుకోవాలి అని ఆలోచించింది.
చెట్టు దగ్గరకు వెళ్లి కాకి తో మాట్లాడటం మొదలు పెట్టింది నక్క. కాకితో ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అన్నది. కాకి అందుకు ఏమీ మాట్లాడలేదు. "నోటిలో మాంసం ముక్క ఉంది ఎలా మాట్లాడాలి ? అని అనుకుంది కాకి. కానీ నక్క వదిలిపెట్టకుండా "ఎక్కడికి వెళ్లి వస్తున్నావు ?చాలా చలాకీగా కనిపిస్తున్నావు? అని అడిగింది. కాకి బాబోయ్! మాట్లాడితే నోట్లో ఉన్న ముక్క కిందకి పడిపోతూ.. అనుకొని మరోసారి మౌనంగా ఉంది.
అయినా కూడా నక్క వదలకుండా, "చలికాలం పోయింది. వేసవి కాలం వచ్చింది. నీవు పాడితే తప్పా, వినడానికి నాకు ఇంకెవరు పాడతారు ఇంత చక్కటి గొంతు కోకిల కూడా లేదు" అని అన్నది. ఇక అమాయకపు కాకి , నక్క జిత్తుల మారి పన్నాగం పన్నుతోందని తెలుసుకోలేక నక్క పొగడ్తలకు పొంగిపోయి, "నక్క ఇంతగా అడుగుతోంది.. పాపం! నక్క బాధపడుతుంది. ఒక్క పాట పాడుతాను.. అంటూ నోరు తెరిచి" కా " అనడం మొదలు పెట్టింది. ఇక అంతే ఎప్పుడెప్పుడు ముక్క నేల రాలుతుందా ? అని ఎదురు చూస్తున్న నక్కకు ఒక్కసారిగా కాకి నోటి లో నుంచి మాంసం ముక్క కింద జారింది.
ఇంకేముంది.. తనకు కావలిసిన మాంసం ముక్క దొరికింది.. వెంటనే నోట కరుచుకుని అక్కడి నుండి పరిగెత్తి పోయింది నక్క. ఓసి ! దొంగ నక్క ఇందుకోసమేనా నన్ను ఇంతలా పొగిడి పాట పాడమన్నావు. అని అనుకొని అక్కడనుండి ఎగిరిపోయింది కాకి..
కేవలం పక్షులు, జంతువులలోనే స్వార్థం వుండడం కాదు మనుషులలో కూడా స్వార్ధపరులు ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారు అంటే వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని తెలుసుకోవాలి. అప్పుడు అప్రమత్తంగా ఉండడం నేర్చుకోవాలి. పొగడ్తలు ఎప్పుడూ ఇతరుల స్వార్థం కోసమే అని తెలుసుకుంటే జీవితం చక్కగా సాగుతుంది..