మంచిమాట : కొత్తగా పెళ్లయిన కొడుకుతో ప్రతి తల్లీ ఇలా చెప్పగలిగితే అంతా శుభమే..
అప్పుడే పెళ్లయిన తన కొడుకుతో ప్రతి తల్లి ఇలా చెప్పగలిగితే, అంతా శుభమే జరుగుతుంది. ముఖ్యంగా తల్లి తన కొడుకుతో ముఖ్యంగా చెప్పాల్సిన విషయాలు 5 ఉన్నాయి. అదేంటో ఇప్పుడు ఒకసారి మనం కూడా తెలుసుకుందాం..
1. నీ భార్యను ఎప్పుడూ తల్లితో పోల్చవద్దు. ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. అదే నీ భార్యకు నీ లాగే ఇది కూడా ఒక కొత్త అనుభవం. నిన్ను నేను ఎలా పెంచానో, తన తల్లిదండ్రులు కూడా అలాగే పెంచి ఉంటారు కదా..! తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకోవాలి. తప్పకుండా తను కూడా మంచి గృహిణిగా,మంచి తల్లిగా బాధ్యతలను నెరవేరుస్తుంది.
2. అంతేకాకుండా నీ భార్యని ఒక మంచి స్నేహితురాలు గా భావించి, అన్ని విషయాలను తనతో పంచుకోవాలి. నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని.. కానీ నీవు మమ్మల్ని, నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక అలాగే మీరు ఇద్దరు ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకొని ప్రేమగా ఉండాలి.
3. నీతో సమానంగా తనని చూసుకోవాలి. నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకోవాలి. ఎందుకంటే నీ మంచిచెడులలో నీకు జీవితాంతం తోడుగా ఉండేది తనే కాబట్టి..
4. పుట్టింటి నుంచి వచ్చిన అమ్మాయికి ఇక్కడి పద్ధతులు, అలవాటులు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం మొహమాటంగా ఉండవచ్చు. నువ్వే తనకు తోడుగా ఉండి, తను సంతోషంగా ఉండేటట్లు చేయాలి.
5. నీ భార్యను మా కంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి. ప్రేమించడానికి వయసుతో పనిలేదు. చిన్నచిన్న సర్ప్రైజ్ లు, కానుకలిచ్చి తనను సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఇక వారాంతంలో బయటికి తీసుకుని వెళ్ళు. పుట్టింటికి తనతో కలిసి వెళ్ళు . నీలాంటి భర్త,మాలాంటి అత్తమామలు లభించడం తన అదృష్టం అని చెప్పుకునేలా మనం అందరం ప్రవర్తిద్దాం..
ఇవన్నీ నేను మీ నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను.. అనుభవిస్తున్నాను. నా అనుభవాలను నీతో చెబుతున్నాను. నువ్వు కూడా మీ నాన్న లాగ ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ, నువ్వు సంతోషంగా ఉంటూ, మమ్మల్ని, నీ భార్యను జాగ్రత్తగా తీసుకుంటావని నమ్ముతున్నాను. నిండు నూరేళ్లు ఆనందంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను..
చూశారు కదా.. ఈ సమాజంలోని ప్రతి అత్త తన కోడలు గురించి ఇలా ఆలోచిస్తే, గృహహింసలకు బలి అవుతున్న ఎంతోమంది ఆడబిడ్డలను కాపాడిన వాళ్ళం అవుతాము..