"మంచి మాట " : నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది..

Divya
" నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది".. అనే సామెతకు అర్థం ఏమిటి అంటే..? మన నోటి నుండి వచ్చే వాక్యాలు కత్తి కంటే పదునైనవి.. కాబట్టి  మనం మాట్లాడే ప్రతి మాట నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిస్వార్థంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే ఒకరిని చూసి మరొకరు నిస్వార్ధంగా  ఉండటం నేర్చుకుంటారో.. అప్పుడు ఆ ఊరు కూడా మంచిదవుతుంది అని ఈ సామెత యొక్క అర్థం.

ఉదాహరణ కు మన ఊరికి ఎవరికైనా పెళ్లి సంబంధం వచ్చారు అనుకోండి. అమ్మాయి ని చూడడానికి వచ్చినా లేదా అబ్బాయిని చూడటానికి వచ్చినా, వారి గురించి విచారణ చేయడానికి తప్పకుండా ఎవరో ఒకరిని మాట్లాడిస్తారు. అలాంటప్పుడు  ఎదుటి వారు మంచి వారు అని మాత్రమే చెప్పాలి. వారిని దూషించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎవరు కావాలని ఏ తప్పు చేయరు సందర్భాన్నిబట్టి ఆ తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నించాలి.  ఫలితంగా ప్రతి ఒక్కరి ఆలోచన మంచిగా ఉన్నప్పుడు ఇక మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా అంతే ఆహ్లాదంగా ఆనందకరంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనము,  మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచిగా ఆలోచిస్తారో,  మనతో పాటు మన ఊరు, అలాగే మన రాష్ట్రం, మన దేశం కూడా మంచిగా అభివృద్ధి పొందుతుంది.

కాబట్టి ఎవరైనా సరే నిస్వార్ధంగా ఉండాలి. పోయేదేముంది నలుగురితో ఆనందంగా ఉంటే.. మనం ఎప్పుడైతే నలుగురితో ఆనందంగా గడుపుతామో.. మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి. ఎదుటివారిని ఎప్పుడూ తప్పు పట్టకూడదు.. సాధ్యమైనంతవరకు తప్పు చేసి ఉంటే, వారిలోని లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నించాలి. ఎదుటి వారు ఏదైనా తప్పు చేసినప్పుడు వారి లోపాలను వేలెత్తి చూపించకూడదని. వారు ఆ తప్పు ఎందుకు చేశారో తెలుసుకుని, దానికి తగిన పరిష్కారాన్ని కనుక్కోవాలి. అప్పుడే ఎదుటి వారికి మనం మంచి వ్యక్తి లాగా కనిపిస్తాము.

అంతేకాదు సాయం అడిగిన వారికి, మనకు సాధ్యమైనంతవరకూ సహాయం చేయడానికి ప్రయత్నించాలి. పక్కనోడు ఏమైపోతే నాకేమీ అనే స్వార్థంతో గడపకూడదు. ఒకానొక సందర్భంలో ఏదో ఒక రోజు మనకు కూడా ఎదుటి వ్యక్తి నుంచి సహాయం అవసరమవుతుంది. మనం ఎవరికైనా సహాయం చేస్తేనే కదా, ఎదుటి వాళ్లు మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరితోనూ మంచిగా మెలగడానికి ప్రయత్నించండి. అని ఇలాంటి సందర్భంలో చెప్పడానికి " నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది".. అనే సామెతను వాడుతారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: