నేరస్థులను చట్టం బందీఖానాలో పెడుతుందన్నది తెలిసిన విషయం. కాసుల కోసం కక్కుర్తి పడుతున్న విద్యావ్యాపారులు వారికి సహకరిస్తున్న పాలకులు,అధికారులు భావిభారత భవిష్యత్తును దిశానిర్దేషం చేసి మనఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పేలా రూపుదిద్దుకోవాల్సిన పౌరులను చదువుల పేరుతో కార్పోరేట్ ఖానాలో బందీలుగా చేస్తున్నారు. ని‘బందనాలు‘ గాలికి వదిలి పిల్లల భవితను,దేశప్రగతిని ప్రమాదపుటంచుల్లోకి తీసుకెలుతున్నాయి ప్రైవేటు విద్యాసంస్థలు. మీబాబు ఎక్కడ ఏమి చదువుతున్నాడు అని అడిగితే శ్రీచైతన్య హైదరాబాద్, మీ పాపను ఎక్కడ చదివిస్తున్నారు అంటే నారాయణ విజయవాడ అంటూ మద్యతరగతి మనిషి కూడా చెపుతూ గర్వంగా ఫీలవడం చిన్నపట్టణాలతో పాటు పల్లెల్లోను చూస్తుంటాం. ఉన్నదంతా ఊర్చి చదివిస్తే రాష్ట్రమో,దేశమో గర్వించదగ్గ స్థాయిలో కాకున్నా వారి కుటుంబసభ్యులు సంబరపడేలా తయారవుతున్న వారెందరన్నది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. మారుమూల పల్లెల్లో,వసతులు లేని ప్రభుత్వపాఠశాలల్లో చదివిన వారిలో కూడా అందరు మెచ్చే ఆణిముత్యాలు వెలుగులోకి రావడం చూస్తున్నాం. సరే ఇదంతా ఆపిల్లవాడికున్న తెలివితేటలు తప్ప ఆవిద్యాసంస్థల పనితీరు కాదనుకుందాం. సచిన్ టెండూల్కర్,ఎస్పీబాలసుబ్రమన్యం,ఏఆర్ రహమాన్,సిరివెన్నెల సీతారామశాస్త్రి,లతో పాటు రాష్ట్రపతి,ప్రధానమంత్రి వంటి పదవులు చేపట్టిన వారెందరో అందరు మెచ్చే గొప్పవారి జాబితాలో ఉన్నారు. వీరు చదివిన చదువులు, ఏకార్పోరేట్ విద్యాసంస్థలు వీరిని ఈస్థాయికి తెచ్చాయి. మనిషి శారీరకంగా,మానసికంగా చక్కగా ఎదగాలన్న వ్యాయామం,క్రీడలు అవసరం.ఒక చదువుతోనే గొప్పవారు, చక్కటి ఆరోగ్యవంతులు కారు. ఏవయసులో తీరాల్సిన ముచ్చట ఆవయసులో , ఏవయసులో చేయాల్సిన పనులో ఆవయసులో చేయాలంటారు. చక్కగా ఆడుతూ,పాడుతూ ఎదగాల్సిన వయస్సులో చదువులతో పేరుతో కార్పోరేట్ విద్యాసంస్థల్లో చదివించడం వల్ల పిల్లలే కాదు మనదేశం కూడా నష్టపోతోంది.ఒక ఆటాపాట ఏఇతర రంగం గూర్చి తెలియకుండా కేవలం పుస్తకాల పురుగులుగా మన పౌరులు ఎదిగితే మనదేశం మిగతా అన్నిరంగాల్లో వెనుకబడిపోతోంది. అత్యదిక జనాభా ఉన్నదేశమైనా ఒలంపిక్స్ లో మనవారు సాధిస్థున్న పథకాలేంటో మనం చూస్తున్నాం. ఒక పాఠశాల,ఒక కళాశాల ఏర్పాటుకు ఫలానా అంత ఆటస్థలం, గేమ్స్ పీరియడ్,పిఇటి, పాటలు,నృత్యం ఇలా ఇతరత్రా నేర్పడానికి టీచర్లు,పీరియడ్స్, ఉండాలని, అవన్నీ ఉన్నట్లయితేనే సదరు విద్యాసంస్థ ఏర్పాటుకు అనుమతినివ్వాలని చట్టం ఉన్నా దాని అమలును కాగితాలకే పరిమితం చేశారు మనపాలకులు,అధికారులు.కార్పోరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న మనపిల్లలను చూడాలన్నా గేట్ బయట మనం,లోపల వాళ్లు నిల్చుని రెండు మాటలు మాట్లాడి రావాల్సిన పరిస్థితి నెలకొంది.జైల్లో ఉన్న ఖైదీలను చూడాలన్నా వారి బందువులు, అయినవారి పరిస్తితి ఇంతే. ఉదయం నుంచి పడుకునే వరకు నాలుగుగోడల మద్య బందీలుగా చదవడం తప్ప స్వేఛ్చాజీవితంతో పాటు మరే ఇతర రంగాలగూర్చి తెలియకుండా పెరుగుతోంది మన భావిభారతం. దీనిపై స్పందించకుంటే జరిగే అనర్థానికి అందరు బాద్యత వహించాల్సిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: