నేడు ఢిల్లీకి సీఎం, పీసీసీ

 హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్తున్నారు. రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు ఈ ఇద్దరు ఢిల్లీకి పయనమైనట్లు సమాచారం. రాష్ర్టపతి ఎన్నికల నేపథ్యంలో సీఎం, పీసీసీని ఢిల్లీకి వెళ్తున్నప్పటికీ...రాష్ట్ర రాజకీయాలపై కూడా చర్చించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   ఉప ఎన్నికల ఫలితాల తరువాత ఇప్పటికే ఒక పర్యాయం పీసీసీ చీఫ్ బొత్స ఢిల్లీకి వెళ్లారు. అక్కడ అందుబాటులో ఉన్న కాంగ్రెస్ పెద్దల్ని కలిసి, రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఉప ఎన్నికల ఫలితాలపై చర్చించినట్లు కూడా సమాచారం. ఫలితాలపై నివేదికల్ని కూడా అందించి ఉంటారని తెలుస్తోంది. ఉప ఎన్నికల తరువాత మొట్టమొదటిసారిగా సీఎం కిరణ్ ఢిల్లీ వెళ్తున్నారు.   రాష్ర్టపతి ఎన్నిక సందర్భంగా సీఎం, పీసీసీ చీఫ్ లిద్దరూ ఢిల్లీకి వెళ్తూనే...ఉప ఎన్నికల ఫలితాలపై ఒకిరిపై మరొకరు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసుకునేందుకు కావల్సినన్ని నివేదికలను వెంట తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ పెద్దలు రాష్ర్ట నాయకత్వంపై ఒకింత ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. రాష్ర్ట నాయకత్వ మార్పు పై కూడా ఆలోచనలు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  అయితే, ప్రస్తుతం రాష్ర్టపతి ఎన్నికలున్న ద్రుష్య్టా రాష్ర్ట నాయకత్వం తాత్కలికంగా వాయిదా వేసుకుందే తప్ప, మరొకటి కాదన్నారు. ఎన్నికల ఘట్టం ముగిసిన తరువాత రాష్ర్టంపై పూర్తి ద్రుష్టిని మళ్లించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ర్టంలో జరిగిన ఉప ఎన్నికల్లో పురుడు పోసుకుని రెండేళ్లు కూడా పూర్తికాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 125ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ను మట్టికరిపించింది. ఇది కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదు. ఈ ఉప ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా వైఎస్ఆర్ పార్టీని, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ను నిలువరించడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది.   నాయకత్వం మార్పుతో పాటు, రాష్ర్టాన్ని విడగొట్టడంపై కూడా కసరత్తులు చేస్తున్నట్లు రాయలసీమకు చెందిన మంత్రి టీజీ వెంకటేశ్ మాటల ద్వారా తెలుస్తోంది. రాష్ర్టంలో మార్పులు తథ్యమనీ కాంగ్రెస్ నాయకులు మానసికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. దీనితో ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స పార్టీ పెద్దలకు వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం-పీసీసీల మధ్యన చెప్పుకోదగ్గ సఖ్యత లేదు. ఎన్నికల ఫలితాల అనందరం వీరిద్దరి మధ్య అగాధం పెరుగుతూనే వుంది. దీనికి నిదర్శనమే ఉప ఎన్నికల ఫలితాలపై బొత్స విలేఖర్ల సమావేశం. కాస్తంతా లోతుగా బొత్స విలేఖర్ల సమావేశాన్ని పరిశీలిస్తే ఫలితాలకు సీఎంను బాధ్యుణ్ని చేసే విధంగా వుంది.   ఎన్నికల వేళ ధరల పెరుగుదల వల్ల తాము ఆశించిన ఫలితాలు రాలేదని బహిరంగంగానే చెప్పారు. అంతే కాకుండా, అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రచారం, అభ్యర్థులకు సమకూర్చే వనరుల దాకా తనకు చెప్పకుండా అన్నీ తానై సీఎం చేశారనీ ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు బొత్స ఫిర్యాదు చేశారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం మరో దఫా ఢిల్లీ వెళ్తున్న పీసీసీ బొత్స ఫలితాలపై సీఎంపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం, పీసీసీ ఇద్దరూ రెండ్రోజుల పాటు ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. నాయకత్వం మార్పు అనేది తథ్యమని ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఫలితాలకు తమకంటే తమకు సంబంధం లేదనీ సీఎం, పీసీసీ ఇద్దరూ పరస్పరం ఫిర్యాదులు చేసుకునే అవకాశం మెండుగానే కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ ఫిర్యాదులు, వివరణలపై కాంగ్రెస్ అధిష్టానం ‘చర్య’లు తీసుకోకపోవచ్చు, రాష్ర్టపతి ఎన్నిక ముగియగానే బాధ్యులను తప్పకుండా తప్పిస్తుందనేది స్పష్టం.   ఇదిలా ఉంటే ఇప్పుటికే గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఢిల్లీలో సోనియాను కలిసి ఉప ఎన్నికల ఫలితాలపై నివేదికను అందించారు. కాంగ్రెస్కు ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తూన్న ఎస్సీలు ఈ ఉప ఎన్నికల్లో జగన్కు దగ్గరయ్యారనీ, కాంగ్రెస్కు దూరమయ్యారనీ, చిరంజీవి గ్లామర్ ఎంత మాత్రం ఉపయోగపడలేదనీ ఫిర్యాదు చేసిన విషయం విధితమే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: