కలం కార్మికుల మధ్య చిచ్చు

 హైదరాబాద్: ‘ఆవులావులు కొట్లాడుకుని దూడలకు పంచాయితీ’ పెట్టిన చందంగా వుంది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ సంభాషణ. నిన్నటి వరకు మీడియా సంస్థల యజమానుల మధ్యన ఉన్న విభేదాలు నేడు విలేఖర్ల వరకు వచ్చాయి. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఫోన్ కాల్సు సంభాషణ విలేఖర్లలో విభేదాలకు కారణమైంది. కొట్లాటలకు దారి తీస్తోంది. ఇప్పటి వరకు విలేఖర్ల మధ్యన ఉన్న ప్రశాంత వాతావరణం చెడిపోయే విధంగా వుంది. సీబీఐ-మీడియా సంస్థల యజమానుల మధ్యన విలేఖర్లు పావులుగా మారడమే కాకుండా, కలం కార్మికుల మధ్య చిచ్చు పెట్టనున్నట్లు ఖాయంగా కనిపిస్తోంది.  గురువారం నాడు వైఎస్ఆర్ పార్టీ నేతలు సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నుంచి పలు మీడియా సంస్థల ప్రతినిధులకు, చంద్రబాల అనే మహిళకు, ఇతర ఐపీఎస్ అధికారులకు వందల సంఖ్యలో వెళ్లిన ఫోన్స్ లిస్టును విడుదల చేశారు. దీనిపై ఎన్టీవీ, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ 9, ఐన్యూస్, జీ 24గంటల చానెళ్లకు చెందిన క్రైం రిపోర్టర్లు రమేశ్ వైట్ల, సత్యనారాయణ, మహాత్మ, కమల్, ఇన్నారెడ్డి తదితరులు హైదరాబాద్ లో విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ పార్టీ నేతలు తమ మొబైల్ నెంబర్లను, తమ పేర్లను బయట పెట్టడం ద్వారా తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయనీ ఆరోపించారు.  తాము ఒక జగన్ కేసు గురించి సీబీఐ జేడీతో మాట్లాడటం లేదనీ, అనేక కేసుల గురించి మాట్లాడటం జరుగుతోందన్నారు. తాము వ్రుత్తి ధర్మంలో భాగంగానే ఫోన్లో మాట్లాడుతున్నామే తప్ప వేరొకటి కాదన్నారు. ఫోన్లో మాట్లాడినంత మాత్రాన తాము కుట్రలో భాగమనే విధంగా తమల్ని వైఎస్ఆర్ నేతలు బదునాం చేయడం తగదనీ సదరు క్రైం రిపోర్టర్లు అంటున్నారు. వ్రుత్తిలో భాగంగా తాము మాట్లాడితే తమల్ని కుట్రదారులుగా బాధ్యులుగా చేయడం తగదనీ, వైఎస్ఆర్ పార్టీ నేతలు 24గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనను చేపడుతామని హెచ్చిరంచారు.  ఇదిలా ఉంటే...వైఎస్ఆర్ వాదన మరోలా వుంది. రాష్ర్టంలోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, టీవీ 9, ఈనాడు తదితర మీడియా సంస్థలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్ సీపీ నాయకులు గత కొంత కాలంగా వాదిస్తూ వస్తున్నారు. వారు చెబుతూ వస్తున్నట్లుగా సీబీఐ జేడీ ఫోను నుంచి చంద్రబాల అనే మహిళ ద్వారా ఆయా మీడియా సంస్థల ప్రతినిధులకు, ఓ యజమానికి ఫోన్లు వెళ్లినట్లు జాబితాను వెల్లడించారు. ఇదిలా ఉంటే...నాలుగైదు మీడియా సంస్థలు చెబుతున్నట్లుగా, సదరు క్రైం రిపోర్టర్లు చెబుతున్నట్లు రిపోర్టర్లు వ్రుత్తి ధర్మంలో భాగంగా అనేక మందితో మాట్లాడటం ఎవరు కాదనలేదు. అయితే, ఈ రాష్ర్టంలో ఏడెనిమిది ప్రధాన తెలుగు దిన పత్రికలు ఉన్నాయి. మరెన్నో ఆంగ్ల పత్రికలున్నాయి. చానెళ్లు ఉన్నాయి. ఆయా పత్రికల రిపోర్టర్లకు, చానెళ్ల రిపోర్టర్లకు రానీ సీబీఐ జేడీ ఫోన్లు ఈ నాలుగైదు మీడియా రిపోర్టర్లకు రావడం వెనక పలువురు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అన్ని పత్రికలకు, చానెళ్లకు లీకులు కాని సీబీఐ జేడీ లీకులు రెండు పత్రికలకు, రెండు చానెళ్లకు ముందుగా లీక్ కావడం కొంత అయోమయానికి గురిచేస్తోంది. దీనిపై సదరు రిపోర్టర్లు ఏమైనా సమాధానం చెబుతారా? జగన్ కేసులకు సంబంధించి రెండు పత్రికల్లో, రెండు మూడు టీవీల్లో రావడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. వీటిపై వైఎస్ఆర్ సీపీ మొదటి నుంచీ ఆరోపణలు చేస్తున్నది. వారి ఆరోపణలు నిజమన్నట్లుగా సీబీఐ జేడీ నుంచి వెళ్లిన వందలాది ఫోను కాల్సు వెళ్లినట్లు వైఎస్ఆర్ నేతలు జాబితాను విడుదల చేశారు. సీబీఐ జేడీ ఆ రెండు పత్రికలకు, ఆ రెండు టీవీ చానెళ్ల రిపోర్టతోనే మాట్లాడటం అందర్నీ ఆలోచింపచేస్తోంది.  జగన్కు సంబంధించి రెండు పత్రికలు, రెండు చానెళ్లలో రావడం, ముందుగా లీక్ కావడం ఎవరికైనా అనుమానం వస్తోంది. మధ్యలో వాసిరెడ్డి చంద్రబాలకు సీబీఐ జెడీ నుంచి వందల సంఖ్యలో ఫోన్లు వెళ్లడం, చంద్రబాల నుంచి ఏబీఎన్ ఎండీకీ ఫోన్లు వెళ్లడం..మళ్లీ చంద్రబాల నుంచి జేడీకి వందల సంఖ్యలో ఫోన్లు రావడం వెనుక మతలబు ఏమిటో వారే చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత సీబీఐకి వుంది, చంద్రబాలకు వుంది. సీబీఐ-మీడియా సంస్థల యజమానులు ఆడిన నాటకంలో విలేఖర్లను భాధ్యులను చేయడం మాత్రం ఎవరికీ తగదు.  అయితే, సీబీఐ-మీడియా సంస్థల యజమాన్యం వారి స్వార్ధాల కోసం ఆడే నాటకంలో కలం కార్మికులు కూడా కొంత దూరంగా ఉండాలి. సంయమనం పాటించాలి.అందరికీ సమదూరంగా ఉండాలి. వ్రుత్తి ధర్మంలో భాగంగా ప్రాణాలు పొగొట్టుకున్నవిలేఖర్లు ఉన్నారు. కానీ, ఏ మీడియా సంస్థ యజమాని సదరు విలేఖరి  కుటుంబాన్ని  ఆర్థికంగా ఆదుకున్నపాపాన పోలేదు.   మనకు సంబంధం లేని వాటిలో మనం వ్రుత్తి ధర్మంఅంటూ తలదూరిస్తే  బలయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి సంఘటనలు గతంలో అనేకమార్లు జరిగాయి. మీడియా సంస్థల యజమానుల స్వార్థానికి పలువురు విలేఖర్లు ఉద్యోగాన్ని పొగొట్టుకుని రోడ్ల పాలయినవారున్నారు. జర్నలిస్టు సోదరులారా తస్మాత్ జాగ్రత్త. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: