రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్..
1977లో జనతా పార్టీ తరఫున హరియాణా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హరియాణా విధానసభకు ఎన్నికయ్యారు. 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రిగా పనిచేశారు.1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించారు.
రాజ్యసభ సభ్యురాలిగా 2004 ఏప్రిల్‌లో సుష్మాస్వరాజ్ ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. జనవరి 2003 నుంచి మే 2004 వరకు మరో రెండూ శాఖలు (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు) అదనంగా చేపట్టారు. 2006 ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతున్నారు.
1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు. అంతకుముందు 1980, 1984, 1989లలో కార్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందారు.1996లో దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
1998లో 12వ లోక్‌సభకు మళ్లీ రెండో సారి దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజపేయీ రెండో మంత్రివర్గంలో మళ్లీ అదే శాఖకు మంత్రిగా పనిచేశారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. దిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి 1998 అక్టోబరులో భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం సుష్మాస్వరాజ్‌ను రంగంలో దింపింది. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో సుష్మా దిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. దిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
ప్రజా ఉద్యమంగా మారిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి భాజపా జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన కృషి వెలకట్టలేనివని కరీంనగర్ భాజపా ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన సుష్మా స్వరాజ్ కన్నుమూయడంతో... తమ ఆత్మీయురాలిని పోగొట్టుకున్నామన్న బాధ ప్రతి తెలంగాణ పౌరుడు మదిలో ఉందన్నారు. సామాన్య తెలంగాణ పౌరుడి మనోవేదనను ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా మలిచిన ధన్యురాలు సుష్మా స్వరాజ్ అని బండి సంజయ్ పేర్కొన్నారు. తమ ఇంటి ఆడపడుచు మరణం తీరనిదని, తెలంగాణ రాష్ట్రానికి గవర్నగా వస్తుందన్న ఎదురుచూపులకు భాగ్యం లేకుండా పోయిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్ మృతి పట్ల బండి సంజయ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె అనుసరించిన సైద్ధాంతిక ఆలోచనా ధోరణిలో తెలంగాణ ప్రజలు పయనించడమే ఆమెకు తెలంగాణ ప్రజలు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.
సుష్మా జీ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో తెలిసిందే. ఆపదలో ఉన్నామని ట్విటర్ వేదికగా ఆమెను ఆశ్రయించిన వారికి ఆపన్న హస్తం అందించేవారు. అందుకే ఆమెను అభిమానులు ‘ట్విటర్ క్వీన్’ అని ముద్దుగా పిలుచుకునే వారు. 2017లో ఓ నెటిజన్ తాను మార్స్‌లో చిక్కుకుని పోయానని సరదాగా ట్వీట్ చేశాడు. ఇందుకు సుష్మ కూడా ఏ మాత్రం తగ్గకుండా ‘మీరు మార్స్‌లో చిక్కుకున్నా సరే..అక్కడ మీకు సాయం చేయడానికి ఇండియన్ ఎంబసీ సిద్ధంగా ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు. దీంతో సుష్మ హాస్య చతురతను ప్రశంసిస్తూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపించారు.