పోస్టుమార్టం:టీఆర్ఎస్ను నిరాశపర్చిన పరకాల  పుంజుకున్న వైఎస్ఆర్ సీపీ

 హైదరాబాద్: పరకాల ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ను నిరాశపర్చింది. ఒక మాటలో చెప్పాలంటే ‘చావు తప్పి కన్ను లొట్ట పోయిన’ చందంగా పరకాల ఉప ఫలితం వుంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందనీ ఆ పార్టీపైకి చెబుతున్నప్పటికీ లోలోపల మాత్రం మధనపడుతున్నట్లు సమాచారం. పరకాలలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ ఓడి గెలిస్తే, టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి మాత్రం గెలిచి ఓడారనే చెప్పాలి.  రెండు వేల లోపు మెజార్టీ రావడం, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ గట్టిపోటీ ఇవ్వడం, టీడీపీ కూడా అనూహ్యంగా బలపడటం వంటి తదితర అంశాలపై పార్టీ సమీక్షను నిర్వహించుకునే పనిలో నిమగ్నమైంది. ఎంతో కష్టపడ్డ ఫలితం ఇలా ఉండటం, వైఎస్ఆర్ సీపీ పుంజుకోవడంతో రానున్న రోజుల్లో టీఆర్ఎస్కు కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం ఖాయమనీ ఆ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు. దీనిపై పోస్టుమార్టం నిర్వహించుకోవడం ఆ పార్టీకి ఎంతయినా అవసరమనీ తెలంగాణ వాదులంటున్నారు.  ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఇక్కడ పుంజుకోవడం టీఆర్ఎస్కు మింగుడుపడటం లేదు. అంతేకాదు, యావత్ తెలంగాణవాదుల్ని ఒకింత ఆశ్చర్యపడేలా చేసింది. ఒకానొక సందర్భంలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ గెలిచే దిశగా పయనించింది. ఇదిలా ఉంటే నాలుగైదు నెలల కిందట జరిగిన పాలమూరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘెర పరాజయాన్ని చవిచూసింది. దీనితో పరకాలను ఆ పార్టీ ప్రతిష్టగా తీసుకుని ప్రచారం నిర్వహించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే ‘పల్లెబాట’పేరిట పార్టీ క్యాడర్ అంతా అక్కడే మకాం వేసింది.  ఎప్పుడూ లేని విధంగా పార్టీ అధినేత కేసీఆర్ ఈ నియోజక వర్గంలో రెండుమార్లు పర్యటించారు. ఎంపీ, విజయశాంతి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే, తెలంగాణ జేఏసీ, విద్యార్థులు, కవులు, కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఇక్కడ టీఆర్ఎస్-వైఎస్ఆర్ పార్టీల మధ్యన హోరాహోరీగా పోటీ జరిగింది. చివరి రౌండ్ వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. మొదట టీఆర్ఎస్ ఆధిక్యతను చాటుకున్న తరువాత వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి సురేఖ తన ఆధిక్యతను పెంచుకుంది. ఒక రౌండ్లో టీఆర్ఎస్, మరో రౌండ్లో సురేఖ ఆధిక్యతను చాటుకోవడంతో గెలుపుపై అందరిలో ఉత్కంఠగా మారింది. చివరి రౌండ్లో భిక్షపతి అతి స్వల్ప మెజార్టీతో విజయం సాధించాడు.  తెలంగాణ రాజకీయ జేఏసీ తన పూర్తి మద్దతును ప్రకటించింది. ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి ఇక్కడ మకాం వేసి ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ నగరా నాయకులు నాగం, హరీశ్వర్ రెడ్డి, సింగరేణి నాయకులు, కవులు, కళాకారులు ఇలా అనేకులు టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేశారు. కానీ, కొండా సురేఖ దంపతులు అన్నీతామై పనిచేశారు. ఒక రోజు మాత్రం విజయమ్మ, షర్మిలలు పర్యటించారు. పాలమూరులో జరిగిన పరాజయాన్ని ద్రుష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టగా తీసుకుని ప్రచారాన్ని నిర్వహించాయి. అందరూ సర్వశక్తులొడ్డి ప్రచారం చేసినా టీఆర్ఎస్ చెప్పినట్లుగా 30-40వేల మెజార్టీ రాకుండా కేవలం 2వేల లోపు మెజార్టీతో గెలుపొండం పట్ల ఆ పార్టీ కొంత షాక్కు గురైంది.  ఒకనాడు తెలంగాణ గడ్డపై వైఎస్ఆర్ సీపీ గురించి మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి పరకాలలో వైఎస్ఆర్ సీపీ గెలిచే దాకా వచ్చిందంటే రానున్న రోజుల్లో ఇక్కడ వైఎస్ఆర్ సీపీ ఎంత బలమైన పార్టీగా మారుతుందో వేరే చెప్పనక్కర్లేదు. పరకాలలో వైఎస్ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు అన్ని పార్టీలను ఆలోచింపచేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: