హైదరాబాద్:. తెలంగాణలో జరిగిన ఏకైక ఎన్నిక పరకాల. తెలంగాణ సెంటిమెంటు విపరీతంగా వుందని భావించినప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి స్వల్ప మెజార్టీతో నే గెలిచాడు. ఈ ఫలితం టీఆర్ఎస్కు కొంత నిరాశకు గురి చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ టీఆర్ఎస్-వైఎస్ఆర్ పార్టీల మధ్యన హోరాహోరీగా పోటీ జరిగింది. చివరి రౌండ్ వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. మొదట టీఆర్ఎస్ ఆధిక్యతను చాటుకున్న తరువాత వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి సురేఖ తన ఆధిక్యతను పెంచుకుంది. ఒక రౌండ్లో టీఆర్ఎస్, మరో రౌండ్లో సురేఖ ఆధిక్యతను చాటుకోవడంతో గెలుపుపై అందరిలో ఉత్కంఠగా మారింది. చివరి రౌండ్లో భిక్షపతి అతి స్వల్ప మెజార్టీతో విజయం సాధించాడు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు రాజేందర్, హరీశ్ మొదలుకుని క్యాడరంతా ఆహార్నిశలు శ్రమించింది. ఎక్కడా ప్రచారం చేయని విధంగా కేసీఆర్ రెండు పర్యాయాలు నియోజక వర్గంలో పర్యటించారు. తెలంగాణ రాజకీయ జేఏసీ తన పూర్తి మద్దతును ప్రకటించింది. ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి ఇక్కడ మకాం వేసి ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ నగరా నాయకులు నాగం, హరీశ్వర్ రెడ్డి, సింగరేణి నాయకులు, కవులు, కళాకారులు ఇలా అనేకులు టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేశారు. కానీ, కొండా సురేఖ దంపతులు అన్నీతామై పనిచేశారు. ఒక రోజు మాత్రం విజయమ్మ, షర్మిలలు పర్యటించారు. పాలమూరులో జరిగిన పరాజయాన్ని ద్రుష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టగా తీసుకుని ప్రచారాన్ని నిర్వహించాయి. అందరూ సర్వశక్తులొడ్డి ప్రచారం చేసినా టీఆర్ఎస్ చెప్పినట్లుగా 30-40వేల మెజార్టీ రాకుండా కేవలం 2వేల లోపు మెజార్టీతో గెలుపొండం పట్ల ఆ పార్టీ కొంత షాక్కు గురైంది. ఇక అధికార కాంగ్రెస్ ఐదో స్థానంలోకి వెళ్లింది. జాతీయ పార్టీలతోనే తెలంగాణ సాధ్యమంటూ రంగంలోకి దిగిన బీజేపీది నాల్గవ స్థానం. మొత్తానికి ఈ ఉప ఎన్నికల్లో కొండా సురేఖ పోరాడి ఓడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: