సుమలత కన్నడనాట ఎన్నికల్లో గెలిస్తే ఇండిపెండెంట్ గా రికార్డే!

ప్రముఖ సినీనటి సుమలత అంబరీష్, కర్ణాటకలోని తన భర్త స్వంత నియోజకవర్గం మాండ్య నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తు న్నారు మాండ్య లోక్ సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలుచేశారు. సుమలత తనమద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసేముందు చాముండేశ్వరీ ఆలయాన్ని సుమలత సందర్శించారు. తన కుమారుడితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

మాజీ మంత్రి - కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలత మండ్య పార్లమెంట్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అయితే  “ఆమె గెలుపు చాలా సులభం” అని పలువురు రాజకీయ నాయకులే చెబుతున్నారు. ఈక్రమంలో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన సుమలత గెలిస్తే కర్ణాటకలో 50 ఏళ్ల రికార్డు ను తిరగరాసిన వారవుతారు. కర్ణాటక రాష్ట్ర చరిత్రలో లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థి గా పోటీ చేసి చివరి సారిగా 1967లో గెలిచారు. అనంతరం ఇప్పటి వరకు ఎంతో మంది పోటీ చేశారు.. కానీ గెలవలేదు.

1957లో అప్పటి మైసూరు రాష్ట్రంలో బీజాపూర్ ఉత్తర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సుగంధి మురుగెప్ప సిద్ధప్ప విజయం సాధించారు. అనంతరం 1967 సార్వత్రిక ఎన్నికల్లో కెనరా నియోజకవర్గం నుంచి దినకర్ దేశాయి ఎంపీగా విజయం సాధించారు. అప్పటి నుంచి కర్ణాటకలో స్వతంత్య్ర అభ్యర్థిగా ఎంపీగా గెలిచిన దాఖలాలు లేవు.  కాగా బుధవారం మండ్య పార్లమెంట్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా నటి సుమలత నామినేషన్ దాఖలు చేశారు. ఫలితంగా స్వతంత్య్ర అభ్యర్థుల విజయాల గురించి ప్రత్యేక కథనం.

2014 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక లోని 28 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 194 మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. కాగా దేశవ్యాప్తంగా 3234 మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా లోక్ సభ బరిలో దిగారు. అయితే కేవలం ముగ్గురు మాత్రమే గెలిచారు.  స్వతంత్య్ర అభ్యర్థులకు దేశవ్యాప్తంగా 0.45 శాతం ఓట్లు వచ్చాయి. కాగా కర్నాటకలోని 194 మంది స్వతంత్య్ర అభ్యర్థులకు 1.57 శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఒక్కరు కూడా గెలవలేదు.

మండ్య పార్లమెంట్ పరిధి లో మండ్య - మద్దూరు - మేలుకోటె - శ్రీరంగపట్టణ - నాగమంగళ - కేఆర్ పేటె - కేఆర్ నగర అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని అసెంబ్లీ స్థానాలను గత 2018ఎన్నికల్లో జేడీఎస్ కైవసం చేసుకుంది. ఇందులో కూడా డీసీ తమ్మణ్ణ - సీఎస్ పుట్టరాజు మంత్రులుగా ఉన్నారు. పైగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ కుటుంబం మొత్తం ప్రచారంలో దిగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: