ఎడిటోరియల్: రగిలిపోతున్న కెఇ..పత్రికా ప్రకటనే నిదర్శనం

Vijaya

ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఒక విధంగా చూస్తే కెఇ అలిగారనే చెప్పాలి. ఇంతకీ కెఇలో అసంతృప్తి లేకపోతే అలగటానికి కారణాలేంటి ? ఏమిటంటే, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం తెలుగుదేశంపార్టీలో చేరటమే. దశాబ్దాలుగా కోట్ల­-కెఇ కుటుంబాల మధ్య ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాలు అందరికీ తెలిసిందే. ఒకపుడు కోట్ల విజయభాస్కరరెడ్డి, కెఇ వర్గాలు ఒకళ్ళను మరొకరు నరుక్కున్న ఘటనలు చాలానే ఉన్నాయి. సరే మిగిలిన జిల్లాల్లో లాగే కర్నూలులో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు బాగా తగ్గిపోయాయి లేండి. కాకపోతే పై రెండు వర్గాల మధ్య పగలైతే అలాగే ఉండిపోయాయి.

  

ఇక ప్రస్తుత విషయానికి వస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చంద్రబాబునాయుడు టిడిపిలో చేర్చుకుంటున్నారు. అమరావతిలో సోమవారం ఇద్దరి మధ్య భేటీ కూడా అయింది. అదే విషయమై కెఇ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా తన బద్ద శతృవైన కోట్లను చంద్రబాబు టిడిపిలోకి తీసుకోవటంపై కెఇ మండిపోతున్నారు. ఆ విషయాన్ని కెఇ ఏమీ దాచుకోలేదు. ఇదే విషయమై ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కోట్ల టిడిపిలో చేరుతున్న విషయమై తనకు అసలు సమాచారమే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

 

కెఇలో ఎంత అసంతృప్తి ఉంటే ఎంతగా మండిపోతుంటే కోట్ల పార్టీలో చేరుతున్న విషయంలో తనకు సమాచారమే లేదని పత్రికా ప్రకటనలో చెబుతారు. అదే వైఎస్ విషయానికి వస్తే ఎవరైనా జిల్లాల్లో నేతలు కాంగ్రెస్ లో చేరతామని వస్తే ఆ జిల్లాలో నేతలతో మాట్లాడందే చేర్చుకునే వారుకారు. భూమా నాగిరెడ్డి దంపతులు ఒకపుడు కాంగ్రెస్ లో చేరాలని వస్తే కాంగ్రెస్ లోని నేతలు వద్దంటే వైఎస్ చేర్చుకోలేదట.


కానీ ఇక్కడున్నది చంద్రబాబు కదా అందుకే కెఇతో ఏమీ చర్చించినట్లు లేదు. ఎవరితో చర్చించినా చర్చించకపోయినా తాననుకున్నది చేసుకుపోవటమే చంద్రబాబుకు తెలిసింది. కడప జిల్లా జమ్మలమడుగులో వైసిపి ఎంఎల్ఏ ఆది నారాయణరెడ్డిని టిడిపిలో చేర్చుకునే ముందు టిడిపి నేత రామసుబ్బారెడ్డి ఎంత అడ్డుకున్నా సరే చంద్రబాబు చేర్చేసుకున్నారు. సరే కోట్ల చేరిక ఎలాగూ కెఇ ఆపలేరు. కాకపోతే భవిష్యత్తులో కెఇ ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: