ఎడిటోరియల్ : పొత్తులు పెట్టుకునే హక్కు చంద్రబాబుకు మాత్రమే ఉందా ?

Vijaya

షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముసుగు తొలగిపోతున్నట్లే ఉంది. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పవన్ తో కలసి టిడిపి పోటీ చేస్తే జగన్ కు ఏంటి నొప్పి ? అంటూ ప్రశ్నించటంలోనే కనిపిస్తోంది భవిష్యత్ ఆలోచనలేంటో. ఇక్కడే చంద్రబాబు ఆలోచనొకటి తెలుస్తోంది. అదేమిటంటే ఏ పార్టీతో అయినా సరే పొత్తులు పెట్టుకునే హక్కు తనకు మాత్రమే ఉందని చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు. చంద్రబాబు, పవన్ కలిసి పోటీ చేయకూడదని జగన్ ఏనాడు చెప్పలేదు. అదే సమయంలో ఏ పార్టీతో కలిసి పోటీ చేయాలన్నది ఆయా పార్టీల ఇష్టమన్న విషయం జగన్ కు తెలీకుండా ఉంటుందా ? కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, తానకు మాత్రమే ఏ పార్టీతో అయినా పొత్తులు పెట్టుకునే హక్కున్నట్లు, జగన్ మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు.

 

ఇక్కడే చంద్రబాబును జగన్ టార్గెట్ చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపి ఒంటరిగానే పోటీ  చేస్తుందని జగన్ ఎన్నోసార్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అదే చంద్రబాబు విషయానికి వస్తే పొత్తులపై ఒక్కసారి కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవటమే విచిత్రం. మొన్న తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్న విషయాన్ని కూడా చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారే కానీ మీడియా ముందు ప్రకటించలేదు. పైగా కాంగ్రెస్ తో పొత్తుల విషయాన్ని లీకుల ద్వారా మీడియా అందించి రియాక్షన్ చూశారు. చివరకు కాంగ్రెస్, టిడిపి పొత్తు విషయాన్ని తెలంగాణా టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ ద్వారా చెప్పించారే కానీ చంద్రబాబు మాత్రం చెప్పలేదు.

 

ఇక, తెలంగాణాలో తగిలిన ఎదురుదెబ్బతో ఏపిలో కాంగ్రెస్ తో పొత్తులుండేది లేండి స్పష్టంగా ఎవరూ మాట్లాడటం లేదు. ప్రతీ ఎన్నికకు ఒకరితో పొత్తు పెట్టుకునే చంద్రబాబే పొత్తులపై జగన్ విమర్శిస్తున్నారు. అలాంటిది పవన్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించటంలో వింతేమీలేదు. ఎందుకంటే, చంద్రబాబు, పవన్ బంధంపై ఇఫ్పటికే అందరిలోను అనుమానాలున్నాయి. అధికారంలో ఉన్న చంద్రబాబును కాకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్నే పవన్ పదే పదే టార్గెట్ చేస్తుండటంతోనే అందరిలోను చంద్రబాబు, పవన్ ఫెవికాల్ బంధంపై అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబు తాజా ప్రకటనతో పవన్ ను లైన్లో పెడుతున్నారనే విషయంలో స్పష్టత వచ్చేసింది.

 

నిజానికి ఏ ఎన్నికను కూడా చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చేయలేరు. చేసిన ఒక్కసారి దారుణంగా ఓడిపోయారు. అప్పటి నుండి పొత్తులు లేందే ఎన్నికలను ఫేస్ చేయటం లేదు. తాను మాత్రం ఏదో ఒకపార్టీతో పొత్తు పెట్టుకుని లాభపడాలి. జగన్ మాత్రం ఎవరితోను పొత్తులు పెట్టుకోకుండా నష్టపోవాలన్నదే చంద్రబాబు ఆలోచనగా అర్ధమవుతోంది. పోయిన ఎన్నికల్లో వైసిపికి ఓట్లేస్తే కాంగ్రెస్ కు వేసినట్లే అన్నారు. అంటే అప్పుడు బిజెపి, పవన్ తో పొత్తు పెట్టుకున్నారులేండి. తర్వాత బిజెపి, పవన్ దూరమైపోయారు.

 

ఎప్పుడైతే బిజెపి, పవన్ దూరమయ్యారో అప్పటి నుండి వారిద్దరూ జగన్ తో కలిసి రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. సరే మళ్ళీ ఇఫుడు పవన్ గురించి చేసిన తాజా వ్యాఖ్యలతో చంద్రబాబు ఆలోచనలేంటో అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేది అనుమానమే. అందులోను కాపులు మండిపోతున్నారు చంద్రబాబుపై. ఇటువంటి పరిస్ధితుల్లో దూరమైన పవన్ ను దగ్గరకు తీసుకుంటే కనీసం కాపులైనా టిడిపికి మద్దతుగా నిలబడతారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకనే పవన్ తో పొత్తు విషయంలో చంద్రబాబు మాటల్లో పొత్తులపై ముసుగు తొలగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: