22న సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ పార్టీ..! పేరేంటో తెలుసా..?

Vasishta

చాలాకాలంగా కొత్త పార్టీ పెడతానంటూ ఊరిస్తూ వస్తున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. అయితే కొత్త పార్టీ పెట్టట్లేదు.. లోక్ సత్తా పగ్గాలు చేపట్టబోతున్నారని ఈ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలను కొట్టేపారేసిన లక్ష్మినారాయణ త్వరలోనే సొంత పార్టీతో ముందుకొస్తానని ఆ మధ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. వచ్చే వారంలో ఆయన పార్టీని ప్రకటించబోతున్నారు.


ఐపీఎస్ ఆఫీసర్ గా, సీబీఐ మాజీ జేడీగా లక్ష్మినారాయణ తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఆయన చేపట్టిన కేసులు, విచారించిన తీరు ప్రశంసలు అందుకున్నాయి. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు ఆయన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనిచ్చే ప్రసంగాలు యువతలో స్ఫూర్తినిచ్చాయి. దీంతో ఆయనపై క్రేజ్ పెరిగింది. యువత మేల్కొంటేనే మెరుగైన సమాజాన్ని స్థాపించేందుకు వీలవుతుందనేది లక్ష్మినారాయణ నమ్మే సిద్ధాంతం. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.


ఉద్యోగానికి రాజీనామా చేయగానే లక్ష్మినారాయణ రాజకీయ పార్టీ పెట్టలేదు. క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లోనూ పర్యటించారు. సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటిని ఎలా పరిష్కరించాలో కూడా వారి నుంచే సేకరించారు. కేవలం సమస్యలు తెలుసుకుంటే సరిపోదని, వాటిని పరిష్కారం చూపించగలిగినప్పుడే మేలు జరుగుతుందని లక్ష్మినారాయణ చెప్తున్నారు.


సమస్యలన్నీ అధ్యయనం చేసిన తర్వాత్ డ్రాఫ్ట్ రూపొందించిన లక్ష్మినారాయణ.. ఓసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆ నివేదికను ఇవ్వాలనుకున్నారు. పలు సందర్భాల్లో ఆయన ఈ మాట ప్రస్తావించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం తన బాధ్యత అని ఆయన వివరించారు. మరోవైపు తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అంశాలపై కూడా లక్ష్మినారాయణ సీరియస్ గానే దృష్టి పెట్టారు. రైతులకు మేలు చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా తాను వారితో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.


ఆప్, జనసేన, లోక్ సత్తా పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినట్లు లక్ష్మినారాయణ చెప్పారు. ఇటీవలే లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. మీడియా సమక్షంలోనే లక్ష్మినారాయణను జేపీ ఆహ్వానించారు. ఆయన ఆహ్వానంపై అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. లోక్ సత్తా పగ్గాలు చేపట్టడం కంటే సొంత పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్తేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చిన లక్ష్మినారాయణ .. పార్టీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.


జేడీ లక్ష్మినారాయణ ఈ నెల 22వ తేదీన పార్టీని ప్రకటించబోతున్నట్టు సమాచారం. విజయవాడలో పార్టీ ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘జనధ్వని – వాయిస్ ఆఫ్ పీపుల్’ను పార్టీ పేరుగా నిర్ణయించినట్టు సమాచారం. అదే రోజు విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. విద్యార్థులు, రైతులు టార్గెట్ గా జన ధ్వని పనిచేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ నిర్మాణం పూర్తి చేసి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: